‘సౌందర్య తర్వాత ఆమె నాకు ఇష్టం.. ఆ అమ్మాయికి రావాల్సినంత సక్సెస్‌ రాలేదు’

10th Class Diaries Movie Teaser Launch - Sakshi

‘‘సినిమా ఇండస్ట్రీలో ఒక్కరితో ఎప్పుడూ సక్సెస్‌ రాదు.. ఒకరికొకరు తోడవ్వాలి. మా గురువుగారు (దాసరి నారాయణరావు) అదే చెప్పేవారు’’ అని నిర్మాత సి. కల్యాణ్‌ అన్నారు. అవికా గోర్, శ్రీరామ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌’. ఈ సినిమాతో సినిమాటోగ్రాఫర్‌ ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అజయ్‌ మైసూర్‌ సమర్పణలో ఎస్‌ఆర్‌ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్‌ పతాకాలపై అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం నిర్మించిన ఈ చిత్రం మార్చి 4న విడుదల కానుంది.

హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ‘టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌’ టీజర్‌ను సి. కల్యాణ్, సినిమాటోగ్రాఫర్‌ ఛోటా కె. నాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా సి. కల్యాణ్‌ మాట్లాడుతూ– ‘‘అభినయం పరంగా సౌందర్య తర్వాత అవికా గోర్‌ అంటే నాకు ఇష్టం. ఆ అమ్మాయికి రావాల్సినంత సక్సెస్‌ ఇంకా రాలేదు. ఈ సినిమాతో తప్పకుండా సక్సెస్‌ వస్తుంది’’ అన్నారు. ‘‘అంజిని చూస్తే ‘టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌’ తీసిన దర్శకుడిలా లేడు. బి. గోపాల్, వీవీ వినాయక్‌లా కమర్షియల్‌ సినిమాలు తీసిన దర్శకుడిలా ఉన్నాడు’’ అన్నారు ఛోటా కె. నాయుడు.

‘‘మేం ఈ సినిమా ఆరంభించినప్పుడు ఒక బడ్జెట్‌ అనుకున్నాం. తర్వాత కొంచెం పెరుగుతోందని అనుకున్నప్పుడు సపోర్ట్‌ అవసరమని అడగ్గానే రవి కొల్లిపర ముందుకొచ్చారు ’’ అన్నారు అచ్యుత రామారావు. ‘‘96, నా ఆటోగ్రాఫ్‌ స్వీట్‌ మెమొరీస్, కొత్త బంగారు లోకం’ కోవలో ‘టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌’ ఉంటుంది’’ అన్నారు ‘గరుడవేగ’ అంజి. ‘‘నేను పదో తరగతిలో ఉన్నప్పుడు ‘ఉయ్యాలా జంపాలా’ సినిమా చేశాను. ‘టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌’లో నా క్యారెక్టర్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది’’ అన్నారు అవికా గోర్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top