కిటకిటలాడిన మార్కెట్లు
నేడే సద్దుల బతుకమ్మ ● పల్లెలు, పట్టణాల్లో ప్రత్యేక ఏర్పాట్లు
మెదక్ మార్కెట్లో రద్దీ
సాక్షి, సిద్దిపేట/మెదక్జోన్: రామా రామా రామా...ఉయ్యాలో... రామనే శ్రీ రామ ఉయ్యాలో... అంటూ తెలంగాణ సంస్కృతి సంప్రదయాలకు అద్దం పట్టే మహిళల సద్దుల బతుకమ్మ వేడుకలకు సర్వసిద్ధమైంది. జిల్లాలో ఆదివారం సద్దుల బతుకమ్మ సంబరాలను ఆడబిడ్డలు జరుపుకోనున్నారు. తీరొక్క పూలతో అందంగా అలంకరించిన రంగురంగుల బతుకమ్మలను తీర్చదిద్దనున్నారు. కొనుగోళ్లతో కూడళ్లు రద్దీగా మారాయి. పెత్ర అమావాస్య నుంచి తొమ్మిది రోజులపాటు జరుపుకుంటారు. చివరి రోజున సద్దుల బతుకమ్మ పండగను నిర్వహిస్తారు. తె లంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
వీడ్కోలు పలకనున్న మహిళలు
బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, ఇలా దేని ప్రత్యేకత దానిదే. తొమ్మిది రోజులపాటు కొనసాగే బతుకమ్మలను చెరువులు, నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ పాటల్లో మహిళల తమ కష్టసుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు ఉంటాయి. ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతకాలపు తొలి రోజుల్లో వస్తుంది. ఆడపడుచులు ప్రకృతి సౌ ందర్యాన్ని రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఉమ్మడి జిల్లాలో అన్ని గ్రామాలు, పట్టణాల్లో బతుకమ్మ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశారు. మహిళలను ఉత్సాహపరిచేందుకు ప్రత్యేకంగా డీజేలను ఏర్పాటు చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లా కేంద్రాలతో పాటు పట్టణాల్లో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. బతుకమ్మ, దసరా పండుగలకు కుటుంబ సమేతంగా నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తుంటారు. బతుకమ్మ కోసం పూలను జోరుగా విక్రయిస్తున్నారు. తంగేడు, గునుగు, సీతజడ పలూ ఇలా పలు రకాల పూలు వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి పట్టణాల్లో విక్రయిస్తున్నారు.పెద్ద ఎత్తున పూలను ఆటోలు, వ్యాన్లలు, ట్రాక్టర్లలో తీసుకొచ్చారు. పేపర్లతో తయారు చేసిన బతుకమ్మలను సైతం పలువురు కొనుగోలు చేశారు.


