ఎస్పీని ఆశ్రయించిన వృద్ధుడు
మెదక్‌జోన్: తన పేరుపై ఉన్న భూమిని ఇద్దరు కొడుకులు పట్టా చేసుకొని తనకు తిండి పెట్టకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఓ వృద్ధుడు ఎస్పీ శ్రీనివాసరావుని ఆశ్రయించాడు. స్పందించిన ఎస్పీ అతడికి అండగా నిలిచారు. వివరాలు ఇలా.. నర్సాపూర్ మండలం రెడ్డిపల్లికి చెందిన భద్రయ్యకు ఇద్దరు కొడుకులు. తన పేరుపై ఉన్న 36 గుంటల భూమిని పట్టా చేసుకుని అన్నం పెట్టడం లేదని సో మవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి వచ్చాడు. వృద్ధాప్యంలో ఇబ్బంది పడుతున్న భద్రయ్య పరిస్థితి తెలుసుకున్న ఎస్పీ.. నర్సాపూర్ సీఐతో ఫోన్‌లో మాట్లాడి వృద్ధుడికి వెంటనే న్యాయం చేయాలని ఆదేశించారు. అంతకుముందు ప్రజావాణి లో ఫిర్యాదులు స్వీకరించారు. అలాగే ముగ్గురు ఏఎస్‌ఐలు రాంబాబు, జైపాల్‌రెడ్డి, కృష్ణమూర్తి ఎస్‌ఐలుగా పదోన్నతి లభించడంతో వారికి బాధ్యతలు అప్పగించారు.


