ఒడిసి
పట్టు..
మెతుకుసీమపై ఎల్‌నినో ప్రభావం అధికంగానే ఉంది. వానాకాలం ప్రారంభమై రెండు నెలలు కావొస్తున్నా చెప్పుకోదగ్గ వర్షాలు లేక లోటు వర్షపాతమే నమోదు అయింది. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ప్రజలందరూ ముందుకు రావాలని వీబీజీరామ్‌జీ పథకంలో విస్తృతంగా ఇంకుడు గుంతల నిర్మాణాలను యుద్ధ ప్రాంతిపదికన నిర్మించాలని ఆశాఖ అధికారులు ఊరూరా అవగాహన కల్పిస్తున్నారు. గతంలో ఈ పథకం ద్వారా వర్షాకాలంలో రకరకాల పనులు చేపట్టేవారు. కానీ తీవ్ర వర్షాభావ పరిసితుల నేపథ్యంలో రాబోయే మూడు నెలల వరకు భూగర్భజలాల పెంపే లక్ష్యంగా ఇంకుడు గుంతల నిర్మాణాలతో పాటు మొత్తం 5 రకా ల పనులు చేసేందుకు శ్రీకారం చుట్టారు.
వర్షపునీరు వృథా కాకుండా..
జిల్లావ్యాప్తంగా 492 గ్రామాలు ఉండగా 1.63 లక్షల జాబ్‌కార్డులు ఉన్నాయి. వాటి పరిధిలో 3.26 లక్షల మంది కూలీలు ఉన్నారు. వీరందరికీ ఉపాధి కల్పించేందుకు ఈ ఏడాది 41 లక్షల పనిదినాలు కేటాయించారు. కాగా, ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు రాబోయే మూడు నెలల పాటు జిల్లావ్యాప్తంగా 39,360 వ్యక్తిగతంగా ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలి. ఒక్కో గ్రామంలో 80 గుంతలకు తగ్గకుండా నిర్మించాలి. ఇందుకు గానూ ఒక్కోదానికి రూ. 6,690 ఇవ్వనున్నారు. అలాగే కమ్యూనిటీ ఇంకుడుగుంతలు వీటిని ప్రభుత్వ స్థలాల్లో నిర్మించాలి. ప్రతి గ్రామంలో రెండు చొప్పున ఒక్కో దానికి రూ.13,400 చొప్పున ఇవ్వనున్నారు. అలాగే రైతుల పంట పొలాల్లో పాంపండ్స్ నిర్మించుకోవాలి. వీటి సైజును బట్టి ఒక్కో దానికి రూ. 1.15 లక్షల నుంచి రూ. 1.78 లక్షల వరకు ఇవ్వనున్నారు. గ్రామంలో రెండింటికి తగ్గకుండా జిల్లావ్యాప్తంగా 984 నిర్మించాలి. అలాగే బోర్‌వెల్ రీఛార్జ్ ఒక్కోదానికి రూ. 36 వేల చొప్పున ఇవ్వనున్నారు. పర్కోలేషన్ ట్యాంకు (చిన్నపాటి కుంటలు) వీటిని ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ ఏరియాల్లో నిర్మించాలి. ఇందుకు ఒక్కోదానికి రూ. 5 లక్షల వరకు ఇస్తారు. ఇవి గ్రామంలో రెండింటికి తగ్గకుండా నిర్మించాలి. వీటి ద్వారా వర్షపునీరు వృథాగా పోకుండా భూమిలోకి ఇంకి భూగర్భజలాలు అభివృద్ధి చెందుతాయి.
వీబీజీ–రామ్‌జీలో భూగర్భజలాల పెంపునకు చర్యలు
ఇంటింటికీ ఇంకుడు గుంతల నిర్మాణం
పాంపండ్స్, బోర్‌వెల్ రీఛార్జ్, పర్కోలేషన్ ట్యాంకులు సైతం..
భాగస్వాములు కావాలి
ఎల్‌నినో ముప్పును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘వీబీజీరామ్‌జీ’ ద్వారా ప్రవేశపెట్టిన జలసిరి పథకంలో అందరూ భాగస్వాములు కావాలి. వృథాగా పోయే వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి పంపించి భూగర్భజాలల పెంపునకు పాటుపడాలి.
– శ్రీనివాస్‌రావు, డీఆర్‌డీఓ
ఎల్‌నినో ముప్పును మూకుమ్మడిగా ఎదుర్కొనేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ నడుం బిగించింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అంగ్ అజీవికా మిషన్ (వీబీజీ–రామ్‌జీ) పథకం ద్వారా విరివిగా ఇంకుడు గుంతలు, పాంపండ్స్, బోర్‌వెల్ రీఛార్జ్, పర్కోలేషన్ ట్యాంకుల నిర్మాణాలతో భూగర్భజాలాలు పెంచేందుకు చర్యలు చేపట్టింది. జనం కదిలి ‘జలరిసి’ పెంచాలని అధికారులు పల్లెల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. – మెదక్‌జోన్


