కొమురవెల్లి(సిద్దిపేట): ఎన్నో ఏళ్ల నుంచి మల్లన్న భక్తుల కలగా మిగిలిన కొమురవెల్లి రైల్వేస్టేషన్ ఆశను ప్రధాని మోదీ నెరవేర్చారని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ పేర్కొన్నారు. కొత్తపల్లి–మనోహరబాద్ రైల్వే లైన్లో నూతనంగా నిర్మించిన కొమురవెల్లి పుణ్య క్షేత్రం రైల్వే స్టేషన్‌ను వారు ఆదివారం ప్రారంభించారు. అంతకుముందు మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ.. గతంలో రైల్వే స్టేషన్ నిర్మించాలన్న, నూతన రైల్వే లైను ఏర్పాటు చేయాలన్న దశాబ్దాల సమయం పట్టేదని, మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయడం ఒక చారిత్రక ఘట్టమని, స్టేషన్ నిర్మాణం కోసం భూమి పూజచేసిన రెండేళ్లలోనే పూర్తిచేసి భక్తులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి కొమురవెల్లికి కేవలం రూ.20లతో చేరుకోవచ్చని ప్రస్తుతం డీజిల్‌తో నడుస్తున్న ఈ లైన్‌ను తర్వలోనే రూ.300 కోట్లతో విద్యుద్దీకరణ చేయనున్నట్లు వెల్లడించారు. మోదీ ప్రభుత్వ సమయం ముగిసేసరికి కొత్తపల్లి నుంచి మనోహరాబాద్ రైల్వే పనులు పూర్తవుతాయన్నారు. అనంతరం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పని చేయాలన్నారు. రాష్ట్రంలో రైల్వే లైన్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వే లైన్ ఏర్పాటుకు మాజీ సీఎం కేసీఆర్ కృషి ఫలించిందన్నారు. ఈ రైల్వే లైన్ ఏర్పాటుకు గత ప్రభుత్వం 50% నిధులు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రాజ్యసభ్యులు కె.లక్ష్మణ్, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవత్సవ,రైల్వే అధికారులు, స్థానిక బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రులు


