మట్టి డబ్బులు స్వాహా! | - | Sakshi
Sakshi News home page

మట్టి డబ్బులు స్వాహా!

Jul 27 2026 7:26 AM | Updated on Jul 27 2026 7:26 AM

మట్టి డబ్బులు స్వాహా! జిల్లాలో నేటి నుంచి విత్తన మేళాలు: కలెక్టర్‌ చేసిన సేవలకే జాతీయ పురస్కారం పీఆర్‌సీని అమలు చేయాలి

శివ్వంపేట(నర్సాపూర్‌): చెరువు మట్టి అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులు గ్రామ పెద్దమనుషుల వద్ద ఉంచగా, వాటికి సంబంధించిన లెక్కలు తేలకపోవడంతో గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధి సికింద్లాపూర్‌లో మూడేళ్ల క్రితం చెరువు మట్టి అమ్మకం ద్వారా గ్రామానికి రూ.16 లక్షల ఆదాయం సమకూరింది. వాటిని గ్రామ అవసరాల కోసం ఖర్చు చేసేందుకు గ్రామానికి చెందిన పలువురు పెద్ద మనుషుల వద్ద ఉంచారు. ప్రస్తుతం ఆ డబ్బులను గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేయాలని అడిగితే వారు బెదిరింపులకు పాల్పడుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రజా అవసరాల కోసం ఖర్చు చేయాల్సిన డబ్బులు సొంతానికి వాడుకోవడం ఎంతవరకు సమంజమని ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి గ్రామ అభివృద్ధి కోసం కేటాయించిన డబ్బులు రికవరీ చేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు.

మెదక్‌ కలెక్టరేట్‌: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నేటి నుంచి జిల్లాలో విత్తన మేళాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 29 వరకు జిల్లాలోని 12 రైతు వేదికల్లో విత్తన మేళా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం లోటు ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నా య పంటలను ప్రోత్సహించడం ఈ విత్తన మేళా ముఖ్య ఉద్దేశమన్నారు. తక్కువ నీరు– ఎక్కువ లాభం వచ్చే పంటలు సాగుచేయాలని రైతులకు సూచించారు. కంది, పెసర, మినుము, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉంటాయన్నారు. జిల్లా లోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

దుబ్బాకటౌన్‌: బుద్ధుడు, పూలే, అంబేడ్కర్‌ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ అందించిన సేవలకే బుద్ధిస్ట్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (బీఎస్‌ఐ) సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల నర్సింహులుకు జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మక గౌతమ బుద్ధ అవార్డు లభించిందని మహిళా కమిషన్‌ సభ్యురాలు శ్వేత తెలిపారు. జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ముత్యాల నర్సింహులుకు ఆదివారం దౌల్తాబాద్‌ మండల కేంద్రంలో ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు చిట్యాల శ్వేత, బీఎస్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఉప్పర మల్లేశం, జిల్లా అధ్యక్షుడు శంకర్‌ బోధి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...బుద్ధుడు బోధించిన కరుణ, సమానత్వం, అహింస, మానవత్వం వంటి విలువలను ప్రజల్లో విస్తృతంగా చైతన్యం కల్పించేందుకు ముత్యాల నర్సింహులు ఎన్నో ఏళ్లుగా నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. అనంతరం ఆయనకు శాలువా కప్పి, పూలమాలలు వేసి, జ్ఞాపికను అందజేశారు.

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్‌సీని అమలు చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (టీపీటీఎఫ్‌) రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రాజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సిద్దిపేట జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా కేంద్రంలోని ఉపాధ్యాయ భవన్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పీఆర్‌సీ నివేదిక వెంటనే తెప్పించుకుని 40% ఫిట్‌మెంట్‌తో వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు 2023 జూలై నుంచి అమలు చేయాల్సిన నూతన పీఆర్‌సీని ఆర్థిక ఇబ్బందులు సాకుతో వాయిదా వేయడం సరికాదన్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సంక్షేమ కార్యక్రమాలు రూ.వేల కోట్ల తో కొనసాగేవా అని ప్రశ్నించారు. ప్రభుత్వం 27 వేల పాఠశాలలను 4 వేల పాఠశాలలకు కుదించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్నారు. హామీలు నెరవేర్చక పొతే ఉపాధ్యాయులు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement