మెదక్ కలెక్టరేట్: మెతుకుసీమ.. అధికారుల కొరతతో సతమతమవుతోంది. జిల్లా కేంద్రం ఏర్పడి సుమారు పదేళ్లు అవుతున్నా, కీలక శాఖల్లోని పోస్టులను ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. పూర్తిస్థాయిలో జిల్లా అధికారులు లేకపోవడంతో సేవల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. కొత్తవారు రావు.. ఉన్నవారు పనిచేయరు అన్న చందంగా పరిస్థితి మారింది.
ఇన్‌చార్జిలే బాధ్యతలు
జిల్లా అభివృద్ధికి అతి ముఖ్యమైన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, విద్యా, వైద్య, సీ్త్ర శిశు సంక్షేమ, పౌర సంబంధాల శాఖ, జిల్లా యువజన క్రీడలు, పర్యాటక, ఇంటర్ విద్యాశాఖ, తూనికలు–కొలత లు, ఎంప్లాయీమెంట్, భూగర్భ జల, మత్స్య, మైనార్టీ సంక్షేమ, జిల్లా పశు సంవర్ధక శాఖ, ఇరిగేషన్ ఈఈ, సోలార్, మార్క్‌ఫేడ్ డీఎం,మార్కెటింగ్ ఏడీ, వయోజన విద్య, చేనేత సంక్షేమ శాఖలను ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు.
అదేబాటలో సంక్షేమ శాఖలు
జిల్లాలో అతి కీలకమైన అంగన్‌వాడీ, సీ్త్రలు, శిశువులకు, వృద్ధులకు సేవలందించే డీడబ్ల్యూఓ పోస్టు సైతం ప్రస్తుతం ఇన్‌చార్జి అధికారితోనే కొనసాగుతోంది. నర్సాపూర్ సీడీపీఓ హేమాభార్గవికి ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలో శిశు విక్రయాలు, బాల్య వివాహాలు పెరిగిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లా మత్స్యశాఖ ఇన్‌చార్జి అధికారి మల్లేశం బదిలీకాగా రెగ్యులర్ అధికారిని నియమించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. అందులో భాగంగానే సంగారెడ్డి జిల్లా మత్స్య శాఖ అధికారి పూర్ణిమకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అలాగే రెండేళ్లుగా ఇంటర్ విద్యా శాఖ నోడల్ అధికారి పోస్టు సైతం ఇన్‌చార్జితోనే కొనసాగిస్తున్నారు. జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ అవినితి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రాగానే బదిలీపై వెళ్లి పోయారు. దీంతో తూప్రాన్ వైద్యాధికారికి జిల్లా ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓగా బాధ్యతలు అప్పగించారు.
సంతకాల కోసమే..
జిల్లా కేంద్రం ఏర్పడినప్పటి నుంచి సంగారెడ్డికి చెందిన ఎంప్లాయీమెంట్ అధికారి రామచంద్రరాజు ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అసలు మెదక్‌లో ఎంప్లాయీమెంట్ అధికారి ఉన్నట్లు జిల్లా ప్రజలకు తెలియదంటే అతిశయోక్తి కాదు. అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టర్లకు మద్దతు పలుకుతూ జిల్లాలోని నిరుద్యోగ యువతకు అన్యాయం చేస్తున్నార్నన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రజావాణికి వచ్చి సంతకం చేసి వెళ్లిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో 500లకు కంపెనీలున్నా.. గడిచిన పదేళ్లలో ఒక్క నిరుద్యోగికి ఉపాధి కల్పించినట్లు దాఖలాలు లేవు.
మెదక్ కలెక్టరేట్
జిల్లాలో భర్తీ కానీ కీలక పోస్టులు


