బ్రేకులు లేని టేకు దందా! | - | Sakshi
Sakshi News home page

బ్రేకులు లేని టేకు దందా!

Jul 24 2026 7:19 AM | Updated on Jul 24 2026 7:19 AM

సామిల్లుల చీకటి వ్యాపారం

మెదక్‌ అర్బన్‌: రంపపు కోత వేదన నుంచి పచ్చని చెట్లను పరిరక్షించడానికి ప్రభుత్వం కొత్త సామిల్‌లకు అనుమతులు ఇవ్వడం మానేసింది. అయినా కలప స్మగ్లర్లు చీకటి మాటున టేకును నరుకుతున్నారు. అనుమతులు లేకున్నా, వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా టేకును తీసుకువచ్చి విక్రయాలు జరుపుతున్నారు. జిల్లాలోని పలుచోట్ల టేకు చెట్లను అడ్డంగా నరికి సామిల్‌లకు తరలిస్తున్నారు. రాత్రి సమయంలో గృహాలకు అవసరమైన టేకు సైజులను కోస్తున్నారు. గత నెల జిల్లా కేంద్రంలోని ఓ సామిల్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ టేకు కలపను ఫారెస్ట్‌ అధికారులు స్వాధీనం చేసుకొని సీజ్‌ చేశారు.

జిల్లాలో 44 సామిల్లులు

జిల్లాలో 44 సామిల్లులు ఉన్నాయి. ఇందులో 18 మిల్లులకు టేకు వ్యాపారం చేసే అనుమతి ఉండగా, మిగితా 26 మిల్లులు లోకల్‌ కలప వ్యాపారం మాత్రమే చేసుకోవాలి. 2004లో సెంట్రల్‌ ఎన్‌ పవర్డ్‌ కమిటీ, ఇక ముందు సామిల్లులకు అనుమతులు ఇవ్వవద్దని స్టేట్‌ లేవల్‌ కమిటీలకు సూచించింది. కాగా, మిల్లులలో వర్టికల్‌ (నిలువు), హారిజెంటల్‌(అడ్డం) మిషన్లు ఉంటాయి. హారిజెంటల్‌ మిషన్లతో పెద్ద పెద్ద కలప మొద్దులను సైతం కోయవచ్చు. అందుకే వాటికి అప్పట్లో ఎక్కువగా అనుమతులు ఇవ్వలేదు. కానీ కొందరు వ్యాపారులు అక్రమంగా హారిజెంటల్‌ మిషన్లు నడుపుతున్నారన్న ఆరోపణలున్నాయి.

పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చి..

ప్రతి సామిల్‌లో ఎంత కలప నిల్వ ఉండొచ్చు అనేదానికి పరిమితి ఉంటుంది. కానీ సామిల్‌ వ్యాపారులు, మహారాష్ట్ర నుంచి పెద్ద మొత్తంలో ఇండియన్‌ టేకు తెచ్చి, చీకటి వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ మేరకు గత నెల 26న మెదక్‌లోని ఓ సామిల్‌పై అధికారులు దాడి చేసి, పరిమితికి మించి నిల్వ ఉన్న 140 సీఎంటీల టేకును సీజ్‌ చేశారు. అయితే ఇతర రాష్ట్రం నుంచి తెచ్చిన టేకు నిబంధనల ప్రకారం కొనుగోలు చేసినప్పటికీ, ఇక్కడ షాపులో మాత్రం అక్రమ పద్ధతిన నిల్వ ఉంచారని అధికారులు చెబుతున్నారు. అయితే ఇతడిపై 2017లో సైతం కేసు నమోదు కాగా, కోర్టుకు వెళ్లినట్లు సమాచారం.

అడ్డంగా నరికేస్తున్నారు

సా్థనికంగా పెంచిన లోకల్‌ చెట్లను గృహావసరాల కోసం వినియోగదారులు, వ్యాపారం కోసం సామిల్లు యాజమానులు అనుమతులు లేకుండా నరుకుతున్నారు. నిజానికి టేకు చెట్ల యజమానులు, చెట్టును అవసరాల కోసం వినియోగించుకోవాలంటే టీజీఎఫ్‌ ఎంఐఎస్‌ పోర్టల్‌లో ట్రీఫెల్లింగ్‌ పర్మిషన్‌ పేరిట దరఖాస్తు చేసుకోవాలి. స్థానిక రెవెన్యూ అధికారులు పరిశీలన చేసిన అనంతరం, చెట్టుకు రూ.500 ఫీజుతో అనమతులు మంజూరు చేస్తారు. అలాగే ఒక చెట్టు నరికితే, రెండు మొక్కలు నాటాలి. కానీ చాలా మంది అనుమతి తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇలాగైతే మరికొన్ని రోజుల్లో టేకు చెట్ల ఉనికికే ప్రమాదం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement