● మెజార్టీ ఓటర్ల అభిప్రాయమిదే ● ఊరిలో ఓటు ఉంటేనే విలువ అనే భావన
● ముమ్మరంగా సాగుతున్న డిజిటలైజేషన్ ● 100 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ
జిల్లాలో మెదక్, నర్సాపూర్ రెండు నియోజకవర్గాలు ఉండగా, 4.53 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కాగా, పల్లెటూర్ల నుంచి పెద్దఎత్తున వలస వెళ్లినవారు ఉన్నారు. ఇందులో గిరిజన తండాలకు చెందిన వారు ఉపాధిని వెతుక్కుంటూ పట్టణాలకు వెళ్లగా, కొందరు ఉద్యోగరీత్యా, మరికొందరు పిల్లల చదువులు, ఇంకొందరు వ్యాపారాల నిమిత్తం పల్లెలను వదిలి పట్టణాలకు వలస వెళ్లారు. వారిలో 90 శాతానికి పైగా సొంతూరుతో పాటు పట్టణాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారు. కాగా, పల్లెలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోరిక మేరకు పట్టణాల నుంచి పల్లెలకు వచ్చి ఓటు వేస్తున్నారు. అలాగే పట్టణాలు, నగరాల్లో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన సమయంలో అక్కడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈక్రమంలో ఒకే వ్యక్తికి ఒకే ఓటు ఉండాలని భావించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటరు సవరణ(సర్) ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దీంతో ఎక్కడో ఒకే చోట మాత్రమే ఓటు కలిగి ఉండాలని, లేనిచో చర్యలు తప్పవని హెచ్చరించింది. దీంతో తమకు సొంతూరులోనే ఓటు కోసం చాలా మంది వలసదారులు ఆసక్తి చూపుతున్నారు. అయితే గ్రామాల్లో ఆస్తులు అమ్ముకొని పట్టణాల్లో స్థిరపడిన వారు మాత్రమే పట్టణాల్లో ఓటు నమోదు చేసుకుంటున్నారు.
పట్టణాల్లో తగ్గనున్న ఓటర్లు
జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో 586 మంది బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌ఓలు) ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాలను అందించారు. కాగా, జిల్లాలో మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీలు ఉన్నాయి. చుట్టుపక్కల పల్లెల ప్రజలు బల్దియాలతో పాటు హైదరాబాద్ లాంటి నగరాల్లో స్థిరపడిన వారు ఉన్నారు. పల్లెలోనూ, పట్టణాల్లోనూ రెండు చోట్ల ఓట్లు ఉన్న వారు రెండేసి ఫారాలను అందుకున్నారు. వాటిని నింపి బీఎల్‌ఓలకు తిరిగి ఇచ్చే సమయంలో ఇబ్బంది పడుతున్నారు. రెండు చోట్ల ఫారాలు అందిస్తే ఆధార్‌కార్డు ఆధారంగా గుర్తిస్తే మా పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. దీంతో గ్రామాల్లోనే ఎన్యూమరేషన్ ఫారాలు అందిస్తూ పట్టణాల్లో తీసుకున్నవి తిరిగి ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఫలితంగా పట్టణాల్లో ఓటర్ల సంఖ్య చాలా వరకు తగ్గే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
79.84 శాతం డిజిటలైజేషన్
జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో 4,53,140 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మెదక్‌లో 2,20,427 మంది ఉండగా, ఇప్పటివరకు 1,79,749 ఓటర్ లిస్టు డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది. దీంతో 81.55 శాతం పూర్తి కాగా, నర్సాపూర్‌లో 2,32,713 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 1,82,051 ఓటర్ లిస్టు డిజిటలైజేషన్ అయింది. ఈలెక్కన 78.23 శాతం అయింది. మొత్తంగా జిల్లాలో 79.84 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. వందశాతం ఎన్యూమరేషన్ ఫారాలు అందించినట్లు తెలిపారు. కాగా, సర్ ప్రక్రియను కలెక్టర్ నిత్యం పర్యవేక్షిస్తున్నారు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. అయితే గ్రామాల నుంచి పట్టణాలకు ఉపాధి కోసం వెళ్లిన వారు, ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు మాత్రం తమ ఓటు హక్కును స్వగ్రామంలోనే ఉంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. చాలా ఏళ్లుగా పట్టణాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారు మాత్రం అక్కడే ఓటు ఉంచుకుంటున్నారు.
– మెదక్‌జోన్
జిల్లాలో ఇలా..
నియోజకవర్గం ఓటర్లు డిజిటలైజేషన్
మెదక్ 2,20,427 81.55
నర్సాపూర్ 2,32,713 78.23


