మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి
మెదక్‌జోన్: జిల్లా కేంద్రంలోని పట్లోళ్ల నారాయణరెడ్డి (పీఎన్‌ఆర్) స్టేడియం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు ఆదివారం మంత్రి వాకిటి శ్రీహరికి లేఖ రాశారు. ఈ స్టేడియంలో నిత్యం క్రీడాకారులు ప్రాక్టీస్ చేస్తుంటారని, సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. అభివృద్ధి కోసం నిధులు మంజూరు లేఖలో విజ్ఞప్తి చేశారు.
మెదక్ కలెక్టరేట్: కలెక్టరేట్‌లో నేడు నిర్వహించే ప్రజావాణిలో హెల్ప్‌డెస్క్ ద్వారా వినతులు స్వీకరిస్తామని కలెక్టర్ ప్రతిమాసింగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లా మంత్రుల సమావేశం ఉందని. దీంతో జిల్లాలోని ఆయా శాఖల అధికారులందరూ ఈ సమావేశానికి వెళ్లాల్సి ఉంటుందన్నారు. జిల్లాలోని ప్రజలు తమ తమ సమస్యలపై హెల్ప్‌డెస్క్ ద్వారా వినతులు అందజేయాలని కలెక్టర్ సూచించారు.
రామాయంపేట(మెదక్): మున్సిపాలిటీలో అమృత్ పథకం కింద కేంద్రం మంజూరు చేసిన నిధులు పెద్ద మొత్తంలో దుర్వినియోగం అయ్యాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాగి రాములు ఆరోపించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో నీటి ఎద్దడి తీర్చడానికి గాను కేంద్రం ఈ నిధులు మంజూరు చేసిందన్నారు. వీటితో కొత్త కాలనీల్లో పైప్‌లైన్లు వేయాల్సి ఉందన్నారు. ఇందుకు విరుద్దంగా గతంలో పైప్‌లైన్ వేసిన కాలనీల్లోనే మళ్లీ వేశారని ఆరోపించారు. తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల ఆవరణలో నిర్మించిన ట్యాంకుల నిర్మాణ పనులు సక్రమంగా జరగలేదన్నారు. పనుల్లో సరైనా నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని, ఇంజనీరింగ్ అధికారులు సైతం నాయకుల బత్తిడికి తలొగ్గారని మండిపడ్డారు. ఈవిషయమై విచారణ జరిపించి నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పటాన్‌చెరు టౌన్: బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారానికి చెందిన నవీన్‌గౌడ్ నియమితులయ్యారు. ఈమేరకు ఆదివారం హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య చేతుల మీదుగా నియామకపత్రం అందజేశారు. ఈసందర్భంగా నవీన్‌గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల పక్షాన ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే విధంగా తన వంతుగా కృషి చేస్తానన్నారు. జిల్లాలో అన్ని కమిటీలు వేసి సంఘాన్ని మరింత బలోపేతం చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన జాతీయ కో ఆర్డినేటర్ అరుణ్ కుమార్, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
సంగారెడ్డి: నియోజకవర్గంలో అర్హులైన ఏ ఒక్కరి ఓటు మిస్ కాకుండా కాంగ్రెస్ బీఎల్‌ఏలు, నాయకులు జాగ్రత్తలు తీసుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూచించారు. గత నెల రోజులుగా అమలవుతున్న సర్ ప్రక్రియపై ఆదివారం పట్టణంలోని ఓ గార్డెన్‌లో పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిర్మలారెడ్డితో కలిసి ముఖ్య నాయకులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని 282 బీఎల్‌ఏలతో ఒక్కొక్కరితో జగ్గారెడ్డి ముఖాముఖిగా మాట్లాడారు. ఇప్పటికి ఎన్ని ఫారాలు పంపిణీ చేశారు, ఇచ్చిన ఫారాల్లో ఎన్ని తిరిగి వచ్చాయి, ఇంకా ఎన్ని రావాల్సి ఉంది అని అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 66.67% ఓటరు నమోదు పూర్తయిందని, గడువులోగా మొత్తం ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు. మూడు రోజుల తర్వాత మరోసారి సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ కన్వీనర్ చేర్యాల ఆంజనేయులు, టీపీసీసీ ప్రధా న కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, నాయకులు కూన సంతోష్, కిరణ్‌గౌడ్ పాల్గొన్నారు.


