● ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీ.ఎస్.మూర్తి
● సీఈఎన్‌ఎస్ ఆధ్వర్యంలో ‘ నానోజాత– 2026’
మాట్లాడుతున్న ఐఐటీహెచ్ డైరెక్టర్ మూర్తి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఐఐటీ హైదరాబాద్ (ఐఐటీహెచ్), బెంగళూరులోని సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మ్యాటర్ సైన్సెస్ (సిన్స్) సంయుక్తాధ్వర్యంలో ఆదివారం క్యాంపస్‌లో ‘నానో జాతా–2026’ జాతీయ సైన్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఆగస్టు 3 నుంచి 5 వరకు బెంగళూరులో జరగనున్న ఇండియా నానో–2026’ సదస్సుకు ముందస్తుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అడ్వాన్స్ 5జీ, 6జీ కమ్యునికేషన్లు, అంతరిక్ష సాంకేతికతలు, స్వచ్ఛ ఇందనం, ఆరోగ్య సంరక్షణ వంటి కీలక రంగాల్లోని అంశాలను ఈ చర్చా వేదికల్లో, ఉపన్యాసాల్లో చర్చించారు. ఈసందర్బంగా ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీ.ఎస్.మూర్తి మాట్లాడుతూ.. నానోజాత కార్యాక్రమం విద్యార్థులు, యువతలో శాసీ్త్రయ ఆలోచన విధానాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. సుస్థిర సమాజ నిర్మాణంలో ఈ టెక్నాలజీకి అపారమైన అవకాశాలున్నాయన్నారు. సీఈఎన్‌ఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీ.ఎల్.వీ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు బహుళ విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలు కలిగిన పరిశోధకులు అవసరమన్నారు. నానో టెక్నాలజీతో సుస్థిర భవిష్యత్తును సాధ్యం చేస్తుందన్నారు. ఈసందర్భంగా నిర్వహించిన ఎగ్జిబిషన్‌లో ఫ్రూట్ జ్యూస్ నుంచి విద్యుత్ ఉత్పాదన, హ్యుమిడిటీ సెన్సార్స్, సోడియం–అయాన్ బ్యాటరీలు, గ్రాఫేన్ ఆధారిత విద్యుత్ సర్క్యూట్ల వంటివి విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనలను రేకెత్తించాయి. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని వివిధ ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలు, ఇతర విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ఈ ఆవిష్కరణలను తిలకించారు.


