● 1,816 చికిత్సలు.. రూ. 2 లక్షల గరిష్ట పరిధి ● జిల్లాలో 7,500 ఉద్యోగులు, 3,700 పింఛన్‌దారులు ● 886 ఆస్పత్రుల్లో సేవలు
పాపన్నపేట(మెదక్): ఏళ్ల తరబడి ఉద్యోగులు ఎదురుచూసిన నగదు రహిత వైద్యం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. పదమూడేళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఈహెచ్‌ఎస్ స్కీం మొక్కుబడిగా మారగా, శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రారంభించింది. మొత్తం 1,816 వైద్య చికిత్సలకు ఈ పథకం కింద వైద్య సేవలు అందనున్నాయి. రాష్ట్రంలోని పేరొందిన 886 పెద్ద ఆస్పత్రుల్లో చికిత్స పొందే అవకాశం ఉంది. ఒక వైద్య చికిత్సకు గరిష్ట పరిమితి రూ.2 లక్షలుగా నిర్ధారించారు. ప్రతి ఉద్యోగికి హెల్త్ డిజిటల్ కార్డు ఇస్తారు. జిల్లాలో సుమారు 7,500 ఉద్యోగులు, 3,700 పింఛన్‌దారులకు ప్రయోజనం కలుగనుంది.
ఉసూరుమన్న ఈహెచ్‌ఎస్
ఏళ్ల తరబడి చేస్తున్న ఉద్యోగుల డిమాండ్ మేరకు 2013 ప్రాంతలో ఈహెచ్‌ఎస్ పథకం ప్రవేశపెట్టారు. కానీ, అది మూన్నాళ్ల ముచ్చటగా మారింది. నిమ్స్‌తో పాటు నాలుగైదు కార్పొరేట్ ఆస్పత్రుల్లో తప్ప, ఎక్కడా నగదు రహిత వైద్య సేవలు అందలేవు. దీంతో చికిత్స చేయించుకున్న ఉద్యోగులు, మొదట డబ్బులు చెల్లించి, తర్వాత రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునే వారు. ఇందులో సగం డబ్బులు కూడా మంజూరయ్యేవి కావన్న ఆరోపణలున్నాయి. ఆర్థిక పరిస్థితులు సరిగా లేని ఉద్యోగులు నానా అవస్థలు పడ్డారు.
కొత్త పథకంపై కోటి ఆశలు
ఎన్‌హెచ్‌ఈఎస్ పథకం ఉద్యోగులకు ఆరోగ్య భరోసా కల్పిస్తుంది. ప్రతి నెలా ఉద్యోగి, పింఛన్‌దారు మూల వేతనం నుంచి 1.5 శాతం వాటా కింద మినహాయించుకుంటారు. అంతే మొత్తాన్ని ప్రభుత్వం ఈ నిధికి జమ చేస్తుంది. భార్యాభర్తలు ఉద్యోగులైతే ఒక్కరి నుంచే వాటా జమ చేస్తారు. అర్హులైన ప్రతి ఉద్యోగి, పింఛన్‌దారు ఈహెచ్‌సీటి పోర్టల్ నుంచి డిజిటల్ హెల్త్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
రూ.5 లక్షలకు పెంచాలి
ప్రభుత్వం ప్రవేశపెట్టిన న్యూ ఈహెచ్‌ఎస్ పథకం ఉద్యోగులకు ఎంతో ప్రయోజనకరం. అయితే ఒక్కో చికిత్సకు నిర్ణయించిన గరిష్ట పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలి. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్య ఖర్చులు భరించాలంటే కష్టం.
– జగదీశ్‌చంద్ర, రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు
పండుటాకులకు వరం
రిటైర్డ్ అయిన పండుటాకులకు నూతన ఆరోగ్య పథకం ఒక వరం. ప్రాణపాయ పరిస్థితుల్లో ఉన్న తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం అందించడానికి కొంత మంది పిల్లలు ముందుకు రావడం లేదు. అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్య సేవలు అందించాలి.
– లక్ష్మణ్ కుమార్, జిల్లా రిటైర్డ్
ఉద్యోగుల సంఘం, కోశాధికారి


