ఇసుక తీసి | - | Sakshi
Sakshi News home page

ఇసుక తీసి

Jul 17 2026 7:33 AM | Updated on Jul 17 2026 7:33 AM

పుష్పాలవాగులో దర్జాగా ఫిల్టర్‌ ఇసుక దందా

మట్టిని కడిగి..

నిత్యం వందలాది ట్రాక్టర్లతో అక్రమ రవాణ

కరువులోనూ కాసులు కురిపిస్తున్న వైనం

పట్టించుకోని అధికార యంత్రాంగం

తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రైతులు మొదలుకొని అన్నివర్గాల ప్రజలు ఆందోళన చెందుతుంటే, మట్టిని ఇసుకగా మార్చి కొందరు అక్రమార్కులు కాసులుగా మార్చుకుంటున్నారు. పుష్పాలవాగులో ఇసుక ఫిల్టర్లు ఏర్పాటు చేసి నిత్యం వందలాది ట్రాక్టర్ల మట్టిని తవ్వుతూ రూ. లక్షలు గడిస్తున్నారు. పట్టణానికి కూతవేటు దూరంలో ఈ అక్రమ దందా జరుగుతున్నా, అధికారులు మిన్నకుండి పోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. – మెదక్‌జోన్‌

జిల్లా కేంద్రానికి అతి సమీపంలో తూర్పు, దక్షిణ భాగంలో పుష్పాలవాగు ఉండగా, దక్షి ణం వైపున బొల్లారం మత్తడి ఉంది. కాగా, ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవటంతో వాగుతో పాటు బొల్లారం మత్తడిలోనూ చుక్కనీరు లేక ఇసుక మేటలు తేలాయి. దీంతో అక్రమార్కుల కన్ను ఇటు వైపు పడింది. అడ్డూ అదుపూ లేకుండా నిత్యం వందలాది ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తూ రూ. లక్షలు గడిస్తున్నారు. ఇసుక మేటలు తరిగిపోవటంతో వాగు అంచున జేసీబీలతో మట్టి తవ్వుతూ ఫిల్టర్లు ఏర్పాటు చేసి కృత్రిమ ఇసుకను తయారు చేస్తూ సహజ వనరులను కొళ్లగొడుతున్నారు.

వాగు రూపురేఖలే మార్చేశారు

మెదక్‌ నుంచి శివ్వాయిపల్లికి వెళ్లే దారిలో తూర్పు దిక్కున గల పుష్పాలవాగుకు ఎటూ నాలుగు వైపులా రోడ్లు ఉన్నాయి. ఈ వాగును ఆనుకొని శివ్వాయిపల్లి తండా గిరిజనులు వ్యవసాయ భూములు ఉండటంతో ఇదే వారికి కలిసొచ్చింది. తండాకు చెందిన యువత నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు జేసీబీలు, ట్రాక్టర్లు, టిప్పర్లతో వాగులో మట్టిని విచ్చలవిడిగా తవ్వుతూ ఇసుక ఫిల్టర్ల ద్వారా కృతిమ ఇసుకను తయారు చేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌ ఇసుకను రూ. 5 వేల చొప్పున విక్రయిస్తూ రూ. లక్షలు గడిస్తున్నారు. దీంతో వాగులో ఎక్కడా చూసినా పెద్ద పెద్ద గొయ్యిలు ఏర్పడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పుష్పాలవాగు రూపురేఖలే మారిపోయాయి. ఈ తతంగం అంతా అధికారులకు తెలిసినా, వారు నెలనెలా ఇచ్చే మామూళ్లుకు అలవాటు పడి చర్యలు తీసుకోకుండా పరోక్షంగా వారికి సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

శివ్వాయిపల్లి తండాలో ట్రాక్టర్లు, జేసీబీలు లేని ఇళ్లంటూ లేదూ. ప్రతి ఇంటి ఎదుట రెండు, మూడు ట్రాక్టర్లు, జేసీబీలు ఉండగా, కొంత మంది ఏకంగా టిప్పర్లు కొనుగోలు చేశారు. ఆ వాహనాలకు నంబర్‌ ప్లేట్లు తొలగించి అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్నారు. తండా సమీపంలో కనుచూపు మేరలో ఇసుక కుప్పలే దర్శనం ఇస్తున్నాయి. వీటిని రాత్రి వేళలో, తెల్లవారుజూమున పట్టణానికి సరఫరా చేస్తున్నారు. అలాగే తిమ్మక్కపల్లి తండా వాసులు సైతం తండా చుట్టూరా ఇసుకను నిల్వ చేసి ఉంచారు.

చర్యలు తీసుకుంటాం

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై గతంలో కేసులు పెట్టాం. వారు రాత్రి వేళల్లో ఇసుకను రవాణా చేస్తుండటంతో వాహనాలను సీజ్‌ చేయటం కష్టంగా మారింది. పోలీసుల సహకారంతో అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం.

– లక్ష్మణ్‌బాబు, మెదక్‌ తహసీల్దార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement