● నానో ఎరువులతో భూసారం భద్రం
● తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు
● అవగాహన కల్పిస్తున్న అధికారులు
రామాయంపేట(మెదక్): వానాకాలం పంటల సీజన్ వేళ ఎరువుల కొరత రైతులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. యూరియా బుకింగ్ యాప్‌పై అవగాహన లేక కొంతమంది ఆందోళన చెందుతున్నారు. సాధారణ యూరియాకు ప్రత్యామ్నాయంగా పంటల సాగులో ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటిస్తే రైతులు పెట్టుబడులు తగ్గించుకుని ఆశించిన దిగుబడులు పొందే అవకాశాలు ఉంటాయి. అందులో భాగంగా నానో ఎరువుల వినియోగంతో కలిగే ప్రయోజనాలపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పంటల దిగుబడులే కాకుండా భూసారం ఎలా కాపాడుకోవాలి? అందుకు సాగులో చేసుకోవాల్సిన మార్పులపై వ్యవసాయ అధికారులు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. సాధారణ డీఏపీ, యూరియా బస్తాలు పంట మొక్కలకు చల్లితే కలిగే ప్రయోజనాలతో పోల్చుకుంటే నానో లిక్విడ్ ఎరువులతో ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు.
ఇవీ ప్రయోజనాలు..
జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 3.67 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందుకు 26,500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని చెబుతున్నారు. కాగా, సాధారణ డీఏపీ, యూ రియా కంటే నానో డీఏపీ, యూరియా రైతులు సులభంగా పొందవచ్చు. బస్తా ఎరువులు చేలల్లో చల్లితే మొక్కలకు 30 శాతం నుంచి 40 శాతం వరకే ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు. అదే నానో లిక్విడ్ ఎరువులు పంట మొక్కలకు పిచికారీ చేస్తే 70 శాతం నుంచి 80 శాతం మొక్కలకు చేరి ప్రయోజనం కలుగుతుందన్నారు. మరోవైపు బస్తా ఎరువులు పొలాలకు తరలిచడం చల్లించడానికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంటోంది. నానో డీఏపీ, యూరియాలను పొలాలకు తరలించడం, పిచికారీ చేయడం సులభం.అందుకు ఖర్చు కూడా తక్కువే. ప్రభుత్వ సబ్సిడీ పోను ఒక్కో డీఏపీ బస్తా ధర రూ.1,350, యూరియా బస్తా ధర రూ. 266గా ఉంది. అరలీటర్ నానో డీఏపీ, యూరియా ఒక్కో బస్తా డీఏపీ యూరియాతో సమానంగా పంటలకు పనిచేస్తుంది. రైతుల్లో మరింత అవగాహన పెంచితే నానో ఎరువుల వినియోగంపై రైతులు ఎక్కువ దృష్టి సారించే అవకాశాలున్నాయి.


