మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 3.67 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ వాటిలో వర్షాధారంగా ఇప్పటికే 38 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు చేయగా, ప్రధానంగా పత్తిసాగు 31,880 ఎకరాలు, మిగతా 6,120 ఎకరాల్లో మొక్కజొన్న, కందులు, పెసర్లు, బొబ్బర్లు, సోయా, తదితర పంటలను సాగు చేశారు. కాగా వారం రోజులుగా చినుకు జాడలేకపోవటంతో మొలకెత్తిన విత్తనాలు ఎండుముఖం పడుతున్నాయి.
ఎల్‌నినో ముప్పు!
జిల్లాపై ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వర్షాలు కురిసే బలమైన కార్తెలు రోహిణి, మృగశిర, ఆరుద్ర, కార్తెలు పోగా ఆరు రోజుల క్రితం పునర్వసు కార్తె కూడా వచ్చింది. ప్రతి ఏటా మృగశిర, ఆరుద్ర కార్తెల్లో వానలు దంచికొట్టేవని, ఈసారి చినుకు జాడ లేదని రైతులు వాపోతున్నారు. జూన్‌లో 112.4 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా 83.8 మి.మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఈ లెక్కన 28.6 మి. మీటర్ల లోటు కనిపిస్తుంది. ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ ఎల్‌నినో ప్రభావం కనిపిస్తోందని, అందుకే వేసవి మాదిరిగా ఎండలు కొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలకు పైగా నమోదు కావడమే ఇందుకు కారణం అని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.
సాగుకు గడ్డుకాలం
వారం పదిరోజుల కోసారి కురిసే చిరుజల్లులకు వర్షాధార పంటలను సాగు చేశారు. ఇక మిగిలింది వరిసాగు ఈ ఏడు 3లక్షల 29 వేల ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా బోరుబావుల ఆధారంగా ఇప్పటి వరకు 3,234 ఎకరాల్లో మాత్రమే సాగైంది. కేవలం 10శాతం మాత్రమే, ఇంకా 90 శాతం వరి సాగు కావాల్సి ఉంది. బోరుబావుల వద్ద నారుమళ్లు పోసి వేసవి దుక్కులు దున్ని సిద్ధంగా ఉన్నారు. నారుమళ్లు సైతం ఎదగడంతో పెద్ద వర్షాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.
తొందరపడి వరి సాగు చేయొద్దు
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వర్షపాతాన్ని బట్టి పంటలను సాగు చేయాలని రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావటంతో ఇటీవల కలెక్టర్ వ్యవసాయ, హార్టికల్చర్, విద్యుత్, ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జులై చివరి వారం వరకు వర్షం కురవకుంటే, వరి సాగుకు బదులు ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా ఇప్పటికే ప్రభు త్వం నుంచి కంది, మినుము, పెసర్లు , తదితర ఆరుతడి విత్తనాలు సరఫరా అయ్యాయి.


