మెదక్‌జోన్: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దామని జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఆపరేషన్ ముస్కాన్– ఆధ్వర్యంలో గడిచిన పది రోజుల్లో 34 మంది చిన్నారులకు రక్షణ కల్పించి 22 కేసులను నమోదు చేశామన్నారు. పిల్లల చేతుల్లో ఉండాల్సింది పనిముట్లు కాదని పుస్తకాలన్నారు. ముఖ్యంగా హోటళ్లు, ఇటుక బట్టీలు, నిర్మాణ పనులు, వ్యాపార సముదాయాలు తదితర ప్రాంతాల్లో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి వెంటనే రక్షించి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూ) ముందు హాజరుపరచాలని తెలిపారు. అనంతరం తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు అప్పగించాలని సూచించారు. పిల్లల బాల్యం విద్యకే అంకితం కావాలని, వారి భవిష్యత్తు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఆదేశించారు. సమావేశంలో డీసీఆర్‌బీ అధికారి జార్జ్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సతేంద్ర ప్రసాద్, విద్యాశాఖ, కార్మికశాఖ అధికారులు పాల్గొన్నారు.
అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్


