బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్
చిన్నశంకరంపేట(మెదక్): ఎస్‌ఐఆర్ ఓటరు సమగ్ర సర్వేపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఎవరి ఓటు ఎక్కడికీ పోదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశంగౌడ్ స్పష్టం చేశారు. చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లిలో బీఎల్‌ఓలు, శక్తి కేంద్రం ఇన్‌చార్జిలతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్‌ఐఆర్‌తో ఓట్లు తీసివేస్తారని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రెండు ఓట్లు ఉన్నవారివి, అసలే ఆధార్‌కార్డులేని వారి ఓట్లు తీసివేస్తారని వివరించారు. ప్రతీ ఓటరు ఎన్యూమరేషన్ ఫారం నింపి ఇవ్వాలని సూచించారు. ఫారం నింపడం రాని ఓటర్లకు బీజేపీ బీఎల్‌ఓలు సహకరిస్తారని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పోగుల రాజు, జిల్లా కార్యవర్గ సభ్యుడు గంగాధర్‌గౌడ్, మల్లారెడ్డి, బాల్‌రాజ్, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
మెదక్‌జోన్: బ్రాహ్మణ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలో బ్రాహ్మణ సదనం భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణ సంఘం భవన నిర్మాణానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డు ప్రాంతంలో నిర్మించనున్న ఈ భవన నిర్మాణానికి రూ.50 లక్షల నిధులు మంజూరు చేయిస్తానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాధిక, వైస్ చైర్మన్ నరేష్‌గౌడ్, నాయకులు గంగాధర్, పవన్, భూపతిరాజు, రమణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దశంకరంపేట(మెదక్): మండల కేంద్రంలోని శ్రీరామాలయంలో శుక్రవారం నిర్వహించిన భరతనాట్య ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. స్థానిక సమ్మోహన నాట్యాలయం ఆధ్వర్యంలో గజ్జల(మువ్వ)పూజా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు భరతనాట్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టారు. చిన్నారులు తమ నాట్య ప్రదర్శన అందరిని అలరించింది. నాట్య కళా నిర్వాహకులు పేరణి తోట ప్రశాంత్‌ను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆలయకమిటీ బాధ్యులు మురళీ పంతులు, కందుకూరి రవీందర్, జశ్వంత్, అనిల్, మహంకాళి కృష్ణమూర్తి, సీతారామారావు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
జోగిపేట(అందోల్): తమ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)లో ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జోగిపేట ఏరియా ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ... తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో రెగ్యులర్ కమిషనర్‌ను వెంటనే అపాయింట్ చేయాలని, రీడిప్లాయిమెంట్, ప్రమోషన్లు, సర్వీస్ రెగ్యులరైజేషన్,పెండింగ్ బిల్స్ ,ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల కొనసాగింపు, సర్వీస్ రిజిస్టర్లు రిటర్న్ చేయడం వంటి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు.


