భూ భారతి సైట్ అప్‌గ్రేడ్‌తో నెమ్మదిగా రిజిస్ట్రేషన్లు
నర్సాపూర్: భూ భారతి సైట్ మొరాయించడంతో భూముల రిజిస్ట్రేషన్లు నత్తనడకన సాగడంతో తహసీల్దార్ల కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ఫైళ్లు పేరుకుపోతున్నాయి. భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన భూ భారతి సైట్‌ను అప్‌గ్రేడ్ చేసే పనులను ప్రభుత్వం గత నెల 25 నుంచి చేపట్టగా పనులు ఇంకా కొనసాగుతున్నాయి. అప్‌గ్రేడ్ చేసే పనులు చేపట్టినప్పటి నుంచి వెబ్‌సైట్ రోజూ గంట నుంచి గంటన్నర సేపు మాత్రమే ఓపెన్ కావడంతో తహసీల్దార్ల కార్యాలయాల్లో ఒకటి, రెండు భూముల రిజిస్ట్రేషన్లే పూర్తవుతున్నాయి. ఏ రోజుకారోజు భూముల రిజిస్ట్రేషన్లు పూర్తి కానందున రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకున్న రైతుల ఫైళ్లు అన్ని మండల తహసీల్దార్ల కార్యాలయాల్లో పేరుకుపోతున్నాయి. కాగా, భూముల రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకుని భూములు అమ్మే వారితో పాటు కొనుగోలు చేసే రైతులు తమకు స్లాట్ కేటాయించబడిన రోజు ఆయా తహసీల్దార్ కార్యాలయాలకు వచ్చినా ప్రయోజనం ఉండటం లేదు. సైట్ రానందున రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరగక రైతులు గంటల తరబడి నిరీక్షించి ఒట్టి చేతులతోనే ఇంటిముఖం పడుతున్నారు. సైట్‌ను అప్‌గ్రేడ్ చేసే పనులు చేపట్టినప్పుడు స్లాట్ బుకింగ్‌ను నిలిపివేస్తే తాము తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని రైతులు అభిప్రాయపడుతున్నారు. అప్‌గ్రేడ్ పనులు చేస్తూనే స్లాట్ బుకింగ్‌కు అవకాశం ఇవ్వడంతో తాము స్లాట్ బుక్ చేసి ఆఫీసులకు వచ్చినా రిజిస్ట్రేషన్లు కానందున ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సైట్ పూర్తి స్థాయిలో పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్‌ను వివరణ కోరగా ప్రభుత్వం సైట్‌ను అప్‌గ్రేడ్ చేస్తోందన్నారు. సైట్ రానందున భూముల రిజిస్ట్రేషన్లు తక్కువ అవుతున్నాయని చెప్పారు. సైట్ సమస్య అంతటా ఉందని, సైట్ అప్‌గ్రేడ్ కాగానే భూముల రిజిస్ట్రేషన్లు యథావిధిగా జరుగుతాయని ఆయన చెప్పారు.
రోజుకు రెండు మూడు మాత్రమే పూర్తి
ఇబ్బందులు పడుతున్నామంటున్న రైతులు


