పాపన్నపేట(మెదక్): ఇంటిని చక్క బెట్టు కోవడమే కాదు.. అవకాశమిస్తే ఊరును..శివారును నందనవనంగా తీర్చిదిద్దుతామని నిరూపిస్తున్నారు మహిళా సర్పంచ్‌లు. పాపన్నపేట మండలం అనంతుని వాగు వద్ద బ్రిడ్జి రోడ్డు దాటాలంటే వాహనదారులకు నిత్య నరకమే. 300 మీటర్ల మేర రోడ్డు వేయక కాంట్రాక్టర్ వదిలి వేయడంతో..గుంతల రోడ్డుపై ప్రయాణించడం కత్తిమీద సాములా మారింది. ప్రయాణికులు దుమ్మెత్తిపోస్తున్నా అధికారుల్లో చలనం లేకపోవడంతో పొరుగు గ్రామాలైన యూసుఫ్‌పేట, ఆరెపల్లి సర్పంచ్‌లు అమ్మరెడ్డి గారి అనిత, మేగజోల్ల రజిత శుక్రవారం ట్రాక్టర్‌తో రోడ్డును చదును చేయించారు. దీంతో వాహనాల రాకపోకలకు రోడ్డు అనుకూలంగా మారింది. ఎన్‌హెచ్ 161 రోడ్డును కలిపే మెదక్–బొడ్మట్‌పల్లి రోడ్డు మధ్యలో, కొత్తపల్లి వద్ద అనంతుని వాగుపై బ్రిడ్జి నిర్మాణం కోసం 2022లో రూ.2.35 కోట్లు మంజూరయ్యాయి. కాగా బ్రిడ్జి నిర్మించిన కాంట్రాక్టర్, రోడ్డు నిర్మాణం చేయకుండా వదిలేయడంతో, అడుగుకో గుంత ఏర్పడింది. వర్షాకాలం వచ్చిందంటే, 300 మీటర్ల దూరం దాటడానికి కనీసం ఎనిమిది నిమిషాలు పడుతుంది. వెంటనే అధికారులు స్పందించి, అర్థంతరంగా వదిలేసిన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
కొత్తపల్లి బ్రిడ్జి రోడ్డు చదునుగా మార్చారు


