మాజీ మంత్రి హరీశ్‌రావు
చిన్నకోడూరు(సిద్దిపేట): రైతులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చిన్న చూపని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులకు అన్నీ కష్టాలే వస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం మండల పరిధిలోని చంద్లాపూర్‌లో ఫర్టిలైజర్ షాపును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రైతులకు సరిపడా యూరియా అందుబాటు ఉంచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. యాప్‌ను రద్దు చేసి నేరుగా యూరియా కొనుగోలు చేసేలా ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు అందించే యూరియాపై సీలింగ్ ఎత్తివేయాలన్నారు. సరిపడా యూరియా సరఫరా చేయాలన్నారు. అనంతరం రంగనాయక సాగర్ కట్ట వద్ద ఆయిల్ పామ్ నర్సరీని సందర్శించారు. ఇతర జిల్లాలకు మొక్కలు తరలించడంతో ఆయిల్ ఫెడ్ అధికారి భాస్కర్‌రెడ్డితో ఫాన్‌లో మాట్లాడారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు సరిపడా మొక్కలు అందించారా? అందించకముందే ఇతర జిల్లాలకు పంపడం ఏమటని ప్రశ్నించారు. నర్సరీని వారానికి ఒకసారి సందర్శించి నిర్వహణ చూడాలని ఆదేశించారు.


