కంప్యూటర్ విద్యనభ్యసించాలనుకుంటుంన్న విద్యార్థుల కల కల్లలైంది. 2008లో ఎనిమిదేళ్ల పాటు ఎంపిక చేసిన కొన్ని పాఠశాలకు ఈ విద్యను 2016 వరకు కొనసాగించారు. అనంతరం మూలన పడేశారు. కాగా గతేడాది 2025లో జిల్లాలో ప్రాధాన్యత క్రమంలో కొన్ని ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసి వాటికి 300కు పైచిలుకు కంప్యూటర్లు సరఫరా చేశారు. అయితే డిజిటల్ విద్యను నేర్పే వారు రాక కంప్యూటర్లు అలాగే పడి ఉన్నాయి.
మెదక్‌జోన్: మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్నిరకాల మేనేజ్‌మెంట్ ఉన్నత పాఠశాలలు 147 హైస్కూల్స్ ఉండగా వాటిలో సుమారు 12వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 2008లో విద్యార్థులకు డిజిటల్ బోధన అవసరమని భావించిన అప్పటి ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని స్కూళ్లను ఎంపిక చేసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ (సీఎస్‌ఆర్) పథకం ద్వారా కంప్యూటర్లను అందించి బోధకులను (ఇన్‌స్ట్రక్టర్లను) సైతం కేటాయించింది. దీంతో విద్యార్థులకు కంప్యూటర్ బోధన బాగానే కొనసాగిన 2016లో ఒప్పందం ముగియడంతో అప్పట్నుంచి కంప్యూటర్ విద్య అటకెక్కింది.
నూతనంగా 389 కంప్యూటర్లు..!
ప్రతీ విద్యార్థికి కంప్యూటర్ చదువులు అవసరమని భావించిన రాష్ట్ర ప్రభుత్వం 2025లో జిల్లాలోని 66 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసి వాటిలో విద్యార్థుల సంఖ్యను బట్టి ఒక్కో పాఠశాలకు 5 నుంచి 10 కంప్యూటర్లు కేటాయించింది. అప్పట్నుంచీ ఇన్‌స్ట్రక్టర్లను నియమించకపోవటంతో అవికూడా ఏడాది కాలంగా మరుగున పడి ఉన్నాయి.
రెండు స్కూళ్లకు ఒకరిని!
పక్కపక్కన ఉన్నటువంటి రెండు పాఠశాలలను ఒక్కటిగా మ్యాపింగ్ చేసి ఒక్కోదానికి ఒక్క ఇన్‌స్ట్రక్టర్‌ను కేటాయించి కంప్యూటర్ బోధన కొనసాగించనున్నారు. ఈ లెక్కన జిల్లాలో 66 పాఠశాలలను ఎంపిక చేయటంతో 33 మంది డిజిటల్ బోధకులు వచ్చే అవకాశం ఉంది.
త్వరలో నియమిస్తాం
పదవ తరగతి విద్యార్థులకు కంప్యూటర్ బోధన అందించాలనే ఉద్దేశ్యంతో విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం గతేడాది జిల్లాలోని 66 ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసి కంప్యూటర్లు అందించింది. వీటి నిర్వహణను ఓ ఏజెన్సీకి అప్పగించారు. వారు త్వరలో ఇన్‌స్ట్రక్టర్లను కేటాయించి బోధన కొనసాగించనున్నారు. –జ్యోతి,
సర్వశిక్ష అభియాన్ ప్లానింగ్ కో–ఆర్డినేటర్
సీఎస్‌ఆర్ కింద 2008 నుంచి ఎనిమిదేళ్లపాటు కొనసాగింపు
గతేడాది 66 ఉన్నత పాఠశాలలకు 389 కంప్యూటర్లు
ఇన్‌స్ట్రక్టర్లు లేక మూలన పడిన పరికరాలు


