కాలుష్యంతో నిత్యం ఇబ్బందులే | - | Sakshi
Sakshi News home page

కాలుష్యంతో నిత్యం ఇబ్బందులే

Jul 8 2026 9:32 AM | Updated on Jul 8 2026 9:32 AM

పరిశ్రమపై చేట్ల గౌరారం, రంగాయిపల్లి గ్రామస్తుల ఆరోపణ

అదనపు కలెక్టర్‌ నగేశ్‌ ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ

తూప్రాన్‌: ఐరన్‌ పరిశ్రమతో నిత్యం ఇబ్బందులు పడుతున్నామని మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం చేట్లగౌరారం, రంగాయిపల్లి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఈ గ్రామాల సమీపంలోని ఎంఎస్‌ అగర్వాల్‌ ఫౌండ్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమ విస్తరణలో భాగంగా పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ మాధురి హాజరయ్యారు. ఈ సందర్భంగా చెట్లగౌరారం, రంగాయిపల్లి గ్రామస్తులు గత 20 ఏళ్లుగా పరిశ్రమతో పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. ఇప్పటికే పరిశ్రమతో వాయు, శబ్ధ, నీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తిరిగి పరిశ్రమను విస్తరిస్తే తాము గ్రామాల్లో నివసించే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి అనుమతులు నిరాకరించాలని కోరారు. అనంతరం పరిశ్రమ ప్రతినిధి నరసింహ మాట్లాడుతూ పరిశ్రమ విస్తరణ కోసం అధునాతన టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఫలితంగా గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చారు. అలాగే రెండు గ్రామాల్లో ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రెండు గ్రామాల నుంచి 43మంది అభిప్రాయాలను సేకరించినట్లు జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌ తెలిపారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులను నివేదిక పంపించనున్నట్లు తెలిపారు.

హెచ్‌ఆర్‌సీని ఆశ్రయిస్తాం: పద్మారెడ్డి

చిన్నశంకరంపేట(మెదక్‌): ప్రజాపాలన అని చెప్పుకుంటున్న ప్రభుత్వం ప్రజలను నిర్బంధం చేసి పరిశ్రమ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడంపై బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు, మాజీ డిప్యూటి స్పీకర్‌రెడ్డి పద్మారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వంటేరు ప్రతాప్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న విషయం తెలుసుకున్న పద్మారెడ్డి, చిన్నశంకరంపేట మండలంలోని బీఆర్‌ఎస్‌ నాయకులు పోలీస్‌స్టేషన్‌కు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డితో కలిసి పద్మారెడ్డి మాట్లాడుతూ ప్రజలను, బీఆర్‌ఎస్‌ నాయకులను నిర్బంధించి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం సిగ్గుచేటన్నారు. ఎంఎస్‌ అగర్వాల్‌ పరిశ్రమను బలవంతంగా ఏర్పాటు చేయడంపై కలెక్టర్‌ను కలిసి వివరించడంతోపాటు హెచ్‌ఆర్సీని ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పరిశ్రమకు అనుమతి ఇస్తే జాతీయ రహదారిని దిగ్బంధం చేసి ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తూప్రాన్‌, మనోహరాబాద్‌, చిన్నశంకరంపేట మండల బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement