సందిగ్ధంలో సహకారం | - | Sakshi
Sakshi News home page

సందిగ్ధంలో సహకారం

Jul 7 2026 6:46 AM | Updated on Jul 7 2026 6:46 AM

పాలకమండళ్ల పదవీకాలం ముగిసి 11 నెలలు

ఎన్నికలా..?

మరోసారి పొడిగింపా?

పాలకమండళ్ల పదవీకాలం ముగిసి 11 నెలలు

నాటి నుంచి ఇన్‌చార్జిలతోనే నిర్వహణ

వచ్చే నెలతో ముగియనున్న పాలన

జిల్లావ్యాప్తంగా 37 సహకార సంఘాలు

గ్రామీణ రైతులకు చేదోడువాదోడుగా ఉండే సహకార సంఘాల భవితవ్యం కొలిక్కి రావడం లేదు. ఇప్పటికే పాలకవర్గాల పదవీ కాలం ముగియగా, 11 నెలలుగా ఇన్‌చార్జిల పాలనలో కొనసాగుతున్నాయి. వచ్చే నెలతో వారి పాలన సైతం ముగియనుంది. దీంతో ఎన్నికలు నిర్వహిస్తారా..? లేక వారినే కొనసాగిస్తారా? అనే సందిగ్ధత నెలకొంది.

– మెదక్‌జోన్‌

జిల్లావ్యాప్తంగా 37 సహకార సంఘాలు ఉండగా, వాటిలో 65 నుంచి 70 వేల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. కాగా, 2020 ఆగస్టులో ఎన్నికలు జరగగా, ఒక్కో సంఘంలో 13 మంది డైరెక్టర్లను ఓటింగ్‌ ద్వారా రైతులు ఎన్నుకున్నారు. అందులో నుంచే ఒకరిని చైర్మన్‌, మరొకరిని వైస్‌ చైర్మన్‌గా ఎనుకున్నారు. అయితే గడిచిన ఐదేళ్లలో రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు కొనసాగించారు. ముఖ్యంగా స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు అందించటం, పండించిన పంట ఉత్పత్తులను మార్కెటింగ్‌లకు మద్దతు ధర కల్పించడం, సభ్యులకు పొదుపు అలవాటు పెంపొందించటం, వ్యవసాయ పనిముట్లను రైతులకు అందుబాటులో ఉంచటం, అర్హులైన రైతులకు ప్రభుత్వ పథకాలు అందించటంతో పాటు అనేక రకాలుగా అన్నదాతల అభివృద్ధికి తోడ్పాటునందించారు.

ఇన్‌చార్జిలుగా కొనసాగింపు

సహకార సంఘాల పాలకవర్గాల పదవీ కాలం 2025 ఆగస్టులో ముగియగా, 2026 ఫిబ్రవరి వరకు పాత పాలకమండళ్లకే ఇన్‌చార్జిల బాధ్యతలు అప్పగించారు. మార్చిలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, కో–ఆపరేటివ్‌ ఉద్యోగులకు ఇన్‌చార్జిలుగా బా ధ్యతలు అప్పగించారు. ఈ విషయంపై మాజీ పీఏసీఎస్‌ చైర్మన్లు హైకోర్టుకెళ్లారు. ఎన్నికలు నిర్వహించే వరకు తమకే ఇన్‌చార్జిలుగా బాధ్యతలు అప్పగించాలని కోరారు. వారి వాదనలను సమ్మతించిన హైకోర్టు ఎన్నికలు జరిగేంత వరకు వారినే ఇన్‌చార్జిలుగా కొనసాగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మరో ఆరునెలల పాటు అనగా 2026 ఆగస్టు వరకు పాత పాలకమండళ్లకే బాధ్యతలు అప్పగించింది.

ఇన్‌చార్జిల పదవీ కాలం వచ్చేనెలతో ముగియనుంది. అయితే ఎన్నికలు నిర్వహిస్తారా..? లేక మరోమారు పాత వారినే కొనసాగిస్తారా..? అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. 2025 ఆగస్టులో వారి పదవీ కాలం ముగిసిన సమయంలో పీఏసీఎస్‌ చైర్మన్‌తో పాటు వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్‌ పదవులను ఎన్నికలకు బదులుగా నామినేటెడ్‌గా నియమిస్తారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఎన్నికల ద్వారా పాలకమండళ్లను కొనసాగిస్తేనే పార్టీలకతీతంగా రైతులకు మేలు జరుగుతుందని పలువురి వాదన. కాగా, వచ్చే నెలతో పాలన ముగుస్తుండటంతో ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement