సత్వర పరిష్కారం: ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

సత్వర పరిష్కారం: ఎస్పీ

Jul 7 2026 6:46 AM | Updated on Jul 7 2026 6:46 AM

సత్వర పరిష్కారం: ఎస్పీ రేబిస్‌ టీకాలు తప్పనిసరి అతిథి అధ్యాపకులకు దరఖాస్తులు ఆరుతడి సాగుతో ఆర్థికాదాయం

మెదక్‌జోన్‌: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను జాప్యం చేయకుడా వెంటనే పరిష్కరించాలని ఎస్పీ శ్రీనివాసరావు పోలీస్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ఆయన స్వయంగా మాట్లాడారు. అనంతరం ఆయా పోలీస్‌ అధికారులతో మాట్లాడారు. ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. బాధితులకు త్వరితగతిన న్యాయం చేయడమే పోలీస్‌ శాఖ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం నేరుగా వచ్చి కలవాలని సూచించారు.

నర్సాపూర్‌: పెంపుడు కుక్కలు, పిల్లులకు రేబిస్‌ టీకాలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య సూచించారు. సోమ వారం ప్రపంచ జూనోసిస్‌ డేను పురస్కరించుకొని స్థానిక పశు వైద్యశాలలో టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం ఉచితంగా అందజేసే టీకాలు, అన్ని పెంపుడు జంతువులకు వేయించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి, పశుసంవర్ధక శాఖ ఏడీ జనార్దన్‌రావు, మండల పశువైద్యాఽ దికారి డాక్టర్‌ స్వప్న, సిబ్బంది గోవర్దన్‌, ఇక్బాల్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా టీకాల కార్యక్రమం మంగళవారం సైతం కొనసాగనుంది.

దుబ్బాక అభివృద్ధికి

సీఎం హామీ: ఎమ్మెల్యే కొత్త

దుబ్బాక: నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం సీఎం నివాసంలో కలిసి నియోజకవర్గానికి సంబంధించి పలు అభివృద్ధిపనులకు నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. హబ్షీపూర్‌ చౌరస్తా నుంచి దుబ్బాక పట్టణం వరకు ఉన్న డబుల్‌ రోడ్డును ఫోర్‌లేన్‌ చేయాలని విన్నవించామన్నారు. మున్సిపాలిటీలో నిర్మించనున్న ఆధునిక నాన్‌వెజ్‌ మార్కెట్‌ కోసం గతంలో మంజూరైన నిధులను తిరిగి విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. అలాగే నియోజకవర్గానికి యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటేడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఆర్‌అండ్‌బీ, పీఆర్‌ రోడ్లకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులు క్లియర్‌ చేయాలని కోరామన్నారు. సీఎంను కలిసిన వారిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య తదితరులు ఉన్నారు.

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): జిల్లాలోని మైనార్టీ రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది (అతిథి అధ్యాపకుల) కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి నాగరాజమ్మ తెలిపారు. పీజీటీ ఫిజికల్‌ సైన్స్‌ (మహిళ), పీజీటీ ఇంగ్లిష్‌, బాటనీ జూనియర్‌ లెక్చరర్‌ (మహిళ), కెమిస్ట్రీ జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 8వరకు గజ్వేల్‌ బాలికల మైనార్టీ గురుకులంలో దరఖాస్తులు అందించాలని, అదే గురుకులంలో ఈ నెల 9న సంబంధిత సబ్జెక్ట్‌లో డెమో నిర్వహించనున్నట్లు తెలిపారు.

మిరుదొడ్డి(దుబ్బాక): ఆరుతడి సాగుతో మంచి ఆర్థికాదాయం సాధించవచ్చని హార్టికల్చర్‌ అధికారి రమేశ్‌ తెలిపారు. సోమవారం మండల పరిధిలోని చెప్యాలలో సాగవుతున్న కూరగాయల పంటలను ఆయన పరిశీలించారు. కూరగాయల సాగుపై రైతులకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి ఎద్దడిని తట్టుకుని ముందుకు సాగాలంటే పప్పుదాన్యాలు, కూరగాయలను పండించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement