గతేడాది వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, చెరువు కట్టలు
● ఏడాదిగా మరమ్మతులు కరువు
● కాలనీ వాసులకు తప్పని వెతలు
రామాయంపేట(మెదక్): అందరికీ వానాకాలం వరమైతే.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు మాత్రం శాపంగా మారుతోంది. చినుకు పడితే చాలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. గతేడాది ఆగస్టులో కురిసిన కుండపోత వర్షాలకు రామాయంపేట మున్సిపాలిటీలోని శ్రీనగర్‌కాలనీ, అక్కలగల్లీ, బీసీ కాలనీల చుట్టూ వరద నీరు చేరింది. ఆ కాలనీలకు ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం కరువైంది. అలాగే జిల్లాలో దెబ్బతిన్న రహదారులు, చెరువు కట్టలు ఏడాది దాటినా మరమ్మతులకు నోచుకోలేదు. కొన్నిచోట్ల తాత్కాలిక మరమ్మతులు చేపట్టినా, మళ్లీ భారీ వర్షాలు కురిస్తే రహదారులు తెగిపోయే ప్రమాదం ఉంది.
● లక్ష్మాపూర్ నుంచి దంతేపల్లి వరకు గతంలోనే పాక్షికంగా శిథిలమైన అంతర్ జిల్లా రహదారి వర్షాలకు మరింత దెబ్బతింది. రోడ్డుపై తేలిన గుంతలు, కంకరతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
● రామాయంపేట మండలం పర్వతాపూర్‌కు వెళ్లే తారు రోడ్డు వర్షాలకు తీవ్రంగా దెబ్బతింది. బ్రిడ్జి తెగిపోయి రోడ్డు, కరెంటు స్తంభాలు కొట్టుకుపోయాయి. అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకున్నారు.
● నిజాంపేట మండల కేంద్రం నుంచి నస్కల్‌కు వెళ్లే రహదారిలో కల్వర్టు వర్షాలకు దెబ్బతింది. భారీ వర్షాలు కురిస్తే కల్వర్టు తెగిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.
● గతేడాది వర్షాలకు జాతీయ రహదారి 765 డీజీపై నందిగామ వద్ద ఏకంగా బ్రిడ్జి కుంగిపోయి పగుళ్లు వ్యాపించాయి. దీంతో రామాయంపేట, సిద్దిపేట ప్రధాన రహదారిపై నెలరోజుల పాటు ప్రయాణాలు స్తంభించాయి. తాత్కాలికంగా బ్రిడ్జి పక్క నుంచి రహదారి నిర్మించినా జాతీయ రహదారుల శాఖ అధికారులు బ్రిడ్జి మరమ్మతులు చేయించలేదు. భారీ వర్షాలు కురిస్తే తాత్కాలికంగా వేసిన రోడ్డు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది.
● హవేళిఘణాపూర్ మండలంలో వర్షాలకు దెబ్బతిన్న పలు గ్రామాలు, గిరిజన తండాల రహదారులకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. తర్వాత అధికారులు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోయారు.
● అలాగే చీపురుదుబ్బ తండా సమీపంలో ఉన్న జిల్లాలోనే అతిపెద్దదైన రాయిన్ చెరువు కట్ట కొంతమేర దెబ్బతింది. నీరు పారే ప్రధాన కాలువ తెగిపోయినా, ఇప్పటివరకు మరమ్మతులు చేపట్టలేదు.
వర్షాలకు కాట్రియాల వద్ద చెరువు కట్ట తెగిపోయి ఏడాది గడుస్తుంది. అయినా ఇప్పటివరకు మరమ్మతులు చేయించలేదు. కనీసం తట్ట మట్టి కూడా పోయకపోవడంతో వర్షాలు కురిస్తే చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం నెలకొంది.


