నిబంధనలు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు తప్పనిసరి

Jul 5 2026 7:20 AM | Updated on Jul 5 2026 7:20 AM

నిబంధనలు తప్పనిసరి నాణ్యమైన విద్యనందించాలి సమన్వయంతో పని చేయండి ప్లాస్టిక్‌ను పూర్తిగా నిర్మూలిద్దాం

రామాయంపేట(మెదక్‌): ‘రక్తం పీల్చేస్తున్నాయి’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా వైద్యాధికారి జ్ఞానేశ్వర్‌ ఆధ్వర్యంలో సిబ్బంది, ఇతర వైద్యశాఖ అధికారులు పట్టణంలోని ల్యాబ్‌లను తనిఖీ చేశారు. రసాయనాలతో పాటు అనుమతి పత్రాలు, ఇతర రిజిస్టర్లను పరిశీలించారు. నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ లింబాద్రి, ఇతర అధికారులు ఉన్నారు.

నర్సాపూర్‌ రూరల్‌: విద్యార్థులకు సంస్కారంతో కూడిన విద్యా బోధన చేయాలని డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్‌రావు ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం మండలంలోని అవంచ గ్రామాన్ని సందర్శించారు. ముందుగా జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రహరీ నిర్మాణ పనులు, నూతనంగా నిర్మిస్తున్న మహిళా సంఘం భవనాన్ని పరిశీలించారు. అనంతరం ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలో మహిళా సంఘం భవనం ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం సంగమేశ్వర్‌, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, మహిళలు విద్యార్థులు పాల్గొన్నారు.

పెద్దశంకరంపేట(మెదక్‌): గ్రామాల అభివృద్ధిలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య గ్రామ కార్యదర్శులు, ఈజీఎస్‌ సిబ్బందికి సూచించారు. శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల వారీగా ఘన వ్యర్థాల నిర్వహణ, వన మహోత్సవం, వర్షాకాల సన్నద్ధతపై తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమీక్ష నిర్వహించారు. ప్రతీ గ్రామంలో నాలుగు రకాల చెత్త సేకరణను సమర్థవంతంగా అమలు చేయాలని, ఇంటింటికీ అవగాహన కార్యక్రమాలు చేపడుతూ స్టిక్కర్లు అందించాలన్నారు. అలాగే వన మహోత్సవాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ క్రాంతికుమార్‌, ఎంపీఓ జాకీర్‌హుస్సేన్‌, ఏపీఓ సంతోశ్‌కుమార్‌ పాల్గొన్నారు.

మెదక్‌జోన్‌: ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌, ఎకో క్లబ్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ హుస్సేన్‌ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ప్లాస్టిక్‌ రహిత దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎకో క్లబ్‌ జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి ఉరుకుల పరుగుల జీవనశైలిలో ప్లాస్టిక్‌ వినియోగం అనివార్యంగా మారిందన్నారు. అయితే అదే నేడు మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర ముప్పుగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎకో క్లబ్‌ కోఆర్డినేటర్‌ మురళి, డాక్టర్‌ విశ్వనాథం, వేణుగోపాలరావు, రాజు, అధ్యాపకుడు వినోద్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement