సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీశ్‌రావు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు, పాదయాత్రలు చేస్తామని హెచ్చరించారు. సంగారెడ్డిలో ఆ పార్టీ శ్రేణులకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై, పార్టీ సభ్యత్వ నమోదుపై శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడారు. జిల్లాను సస్యశ్యామలం చేసే ఈ రెండు ఎత్తిపోతల పథకాల విషయంలో జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ, కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు, హైదరాబాద్‌కు తాగునీరు అందించే సింగూరు ప్రాజెక్టు మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో జిల్లాకు మంజూరైన ఎస్‌డీఎఫ్ నిధులను కాంగ్రెస్ సర్కారు వెనక్కి తీసుకుందని, వెంటనే ఈ నిధులను విడుదల చేయాలని కోరారు. జొన్న రైతులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అసైన్డ్ భూములిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు వారి భూములనే లాక్కుంటోందని ధ్వజమెత్తారు. ఒక్క సంగారెడ్డిలోనే 700 ఎకరాలను లాక్కునేందుకు కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, సునీతారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, శశిధర్‌రెడ్డి, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, పట్నం మాణిక్యం, కాసాలబుచ్చిరెడ్డి, డాక్టర్ శ్రీహరితోపాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలపై మంత్రి ఎందుకుమాట్లాడటం లేదు
సింగూరు మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలి
మాజీమంత్రి హరీశ్‌రావు


