ఖరీఫ్ రుణ ప్రణాళిక ఖరారు
● గతేడాదితో పోలిస్తే రూ.142.87 కోట్లు అదనం
● వరికి రూ.51 వేలు, పత్తికి రూ.50 వేల పరిమితి
ఖరీఫ్‌కు సంబంధించి జిల్లా వ్యవసాయ వార్షిక రుణ ప్రణాళిక సిద్ధం అయింది. ఈ సీజన్‌లో రూ. 4,192 కోట్ల పంట రుణాలు రైతులకు అందించాలని నిర్ణయించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి రూ.142.87 కోట్లు అదనంగా కేటాయించారు. వ్యవసాయాధారిత జిల్లాగా ఉన్న మెతుకుసీమలో సాగు వ్యయాలు పెరుగుతుండటంతో ఈసారి పంట రుణాల లక్ష్యాన్ని పెంచినట్లు అధికారులు చెబుతున్నారు.
– మెదక్‌జోన్
జిల్లావ్యాప్తంగా 4 లక్షల పైచిలుకు ఎకరాల వ్యవసాయభూములు ఉండగా, అందులో ఈ ఏడాది 3.70 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం రైతులకు రూ.4,192 కోట్ల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో పంట రుణంతో పాటు వ్యవసాయ అనుబంధ దీర్ఘకాలిక, సూక్ష్మ రుణాలను ఇవ్వనున్నారు. కాగా, గతేడాది రూ.4,046.13 కో ట్లు మంజూరు చేయగా, అందులో రూ.3,580.08 కోట్లు రైతులకు అందజేశారు. ఇంకా 446.04 కోట్లు మిగిలిపోయాయి. ఈ లెక్కన 88.48 శాతం రుణాలను అన్నదాతలకు పంపిణీ చేశారు. ఈ వానా కాలం సీజన్‌కు సంబంధించి రూ. 4,192 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి రూ.145.87 కోట్లు అదనంగా పెంచారు.
22 బ్యాంకుల ద్వారా పంపిణీ
వ్యవసాయ పెట్టుబడి పెరుగుతుండటంతో గతేడాదితో పోలిస్తే పంటల సాగు ఖర్చులను పెంచారు. జిల్లాలో సింహభాగం వరి సాగు కానుంది. గ తేడాది వరికి ఎకరాకు రూ. 44 వేల నుంచి రూ.46 వేల రుణం ఇవ్వగా, ఈఏడాది రూ. 48 వేల నుంచి రూ. 51 వేల వరకు పెంచారు. అలాగే పత్తికి గతేడాది ఎకరాకు రూ. 46– 48 వేలు ఉండగా, ఈసారి రూ.50 వేలకు పెంచారు. మొక్కజొన్నకు ఎకరాకు రూ. 34–36 వేలకు గానూ ఈసారి రూ. 38 వేలకు పెంచారు. అలాగే కందులు, పెసర్లు, మినుములు, జొన్నల పంటలకు సైతం గతేడాదితో పోలిస్తే పంట రుణం పెంచారు. జిల్లాలో అధికారికంగా 2.63 లక్షల మంది రైతులు ఉండగా, ఈ ఏడాది కొత్తగా 23,455 మందికి కొత్త పట్టాలు వచ్చాయి. ఇందులో ప్రధానంగా పార్ట్–బీ భూములకు సంబంధించిన రైతులు ఉండగా, మరికొందరు ఇతరుల వద్ద కొనుగోలు చేసిన వారు ఉన్నా రు. వీరికి 22 బ్యాంకుల ద్వారా రుణాలను అందించనున్నారు.


