ఏడుపాయలకు
పాపన్నపేట(మెదక్): తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయలకు పర్యాటక కళ వచ్చింది. 12 కాటేజీల నిర్మాణం కోసం టీజీటీడీసీ రూ.7 కోట్లు మంజూరు చేసింది. పర్యావరణ పరిరక్షణ కనుగుణంగా నిర్మించే ఈ కాటేజీలు.. అధునాతన సౌకర్యాలు కలిగి ఉంటాయి. దీంతో భక్తులకు కొంత మేర తిప్పలు తప్పనున్నాయి.
అన్నీ అసౌకర్యాలే..
ఏడుపాయల వన దుర్గాభవానీ ఆలయాన్ని ఏటా 20 లక్షల మంది భక్తులు సందర్శిస్తారు. సుమారు రూ.20 కోట్ల ఆదాయం ఉంటుంది. ఇక్కడ భక్తులు సేద దీరేందుకు 56 సత్రాలు ఉండగా, అందులో 46 దాతలవే. ఇక 10 మాత్రమే ఎండోమెంట్‌వి. నిత్యం వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఇవి ఏ మూలకు సరిపోవడం లేదు. దీంతో మైదాన ప్రాంతాల్లో టెంట్లు వేసుకొని, చెట్ల కింద సేద దీరుతుంటారు. వర్షాకాలంలో వంట చేసుకునేందుకు తిప్పలు అన్నీ ఇన్ని కావు. ఉన్న సత్రాల్లో కూడా కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఎక్కడ చూసినా ఆహార వ్యర్థాలు, ఖాళీ మందు బాటిళ్లు దర్శనమిస్తాయి. నీళ్లు రాని కులాయిలు.. తిరుగని ఫ్యాన్లు, వినియోగించుకోవడానికి వీలు లేని టాయిలెట్లు, బయటకు పారని మురికి నీరు, ఈగలతో భక్తులు నానా అవస్థలు పడుతుంటారు. హరిత హోటల్‌లో రూములు ఉన్నప్పటికీ, అవి సామాన్యుడికి అందుబాటులో ఉండవు. ఎప్పుడు వీఐపీల ఆధీనంలోనే ఉంటాయి.
ఆధునిక సౌకరాల్యతో నిర్మాణం
పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ.. ఆధునిక సౌకర్యాలతో కూడిన 12 కాటేజీలను నిర్మించడానికి టీజీటీడీసీ రూ.12 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు గతంలో ఏడుపాయలను సందర్శించిన అధికారులు, అక్కడి వాతావరణానికి అనునుగుణంగా, ఎకో ప్రెండ్లీ కాటేజీల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించారు. ఈమేరకు ప్రభుత్వం సోమవారం రూ.7 కోట్లు మంజూరు చేసింది. ఈసందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ.. ఏడుపాయల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామన్నారు. తమ విజ్ఞప్తి మేరకే ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు.
12 కాటేజీల నిర్మాణానికి రూ.7 కోట్లు మంజూరు
భక్తులకు కొంతమేర తప్పనున్న తిప్పలు


