మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలను తక్షణం పరిష్కరించి అర్జీదారులకు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లాస్థాయి ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 83 అర్జీలు రాగా, అందులో ఇందిరమ్మ ఇళ్ల కోసం 14, భూభారతి 33, పెన్షన్లు 4, ఇతర సమస్యలు 32 ఉన్నాయి. అనంతరం కలెక్టరేట్‌లో నిర్వహించిన జాతీయ గణాంక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రొఫెసర్ మహలనోబిస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడే ఏర్పాటు చేసిన సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్– 2026 ఘన వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పట్టణంలోని గాంధీనగర్ వీధిలో జరుగుతున్న ఓటరు నమోదు పత్రాల పంపిణీని కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈసందర్భంగా ఓటర్లు, అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఓట్లు తొలగిస్తారనే తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని, అర్హుల ఓటు ఒక్కటి కూడా తొలగిపోకుండా అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. అంతకుముందు డీపీఆర్‌ఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 99 రోజుల పట్టణ ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ నగేశ్, డీఆర్‌ఓ అంబదాస్ రాజేశ్వర్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, డీఎఫ్‌ఓ జోజి, తహసీల్దార్ లక్ష్మణ్‌బాబు, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతిమాసింగ్
ప్రజావాణికి 83 వినతులు


