చెరువుల్ని చెరమట్టి | - | Sakshi
Sakshi News home page

చెరువుల్ని చెరమట్టి

Jun 7 2026 9:00 AM | Updated on Jun 7 2026 9:00 AM

రాత్రింబవళ్లూ తవ్వకాలు వందలాది వాహనాల్లో అక్రమ రవాణా రూ.వందల కోట్ల సహజ సంపద లూఠీ? అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న అధికార యంత్రాంగం!

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం మంతూరు పోచంపెద్ద చెరువులో పది వేల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తవ్వుకునేందుకు స్థానిక అధికారులు అడ్డదారిలో అనుమతులు కట్టబెట్టారు. వాల్టా చట్టాన్ని, పర్యావరణ నిబంధనలను చెరువులోనే తొక్కేసి ఇచ్చిన ఈ అనుమతుల జారీ వెనుక ఆయా శాఖల అధికారులకు రూ.లక్షల్లో ముడుపులు ముట్టాయనేది బహిరంగ రహస్యం. ఈ అడ్డదారిలో పొందిన అనుమతులను ఆసరాగా చేసుకుని ఇక్కడ విచ్చలవిడిగా మట్టి దందా సాగుతోంది. రాత్రి, పగలు తేడా లేకుండా భారీ కెపాసిటీ కలిగిన జేసీబీలతో తవ్వకాలు చేస్తున్నారు. ఎన్ని క్యూబిక్‌మీటర్లు తరలిస్తున్నారనేది లెక్కపెట్టే నాథుడే లేకుండా నిత్యం వందలాది భారీ టిప్పర్లలో విలువైన సహజ సంపదను తరలిస్తున్నారు.

సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ పెద్ద చెరువులోనూ 50 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తవ్వుకునేందుకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు జారీ అయ్యాయి. ఈ అనుమతులను ఆసరాగా చేసుకుని విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. భారీ జేసీబీలతో పెద్ద చెరువు గర్భాన్ని తొలిచేస్తున్నారు.

సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో మట్టి అక్రమ దందా మూడు జేసీబీలు..ఆరు టిప్పర్లు అన్నట్లు సాగుతోంది. దొడ్డిదారిన తీసుకున్న నామమాత్ర అనుమతుల పేరుతో రూ.కోట్లు విలువ చేసే సహజ సంపదను లూఠీ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రీ పగలు తేడా లేకుండా చెరువులను తొలిచేస్తున్నారు. హై కెపాసిటీ కలిగిన జేసీబీలు, ప్రొక్లయినర్లను దించి చెరువులను తొలిచేస్తున్నారు. నిత్యం వందలాది టిప్పర్లలో మట్టిని నింపి తరలిస్తున్నారు. అడ్డదారిలో తరలిస్తున్న ఈ మట్టి విలువ రూ.వందల కోట్లు ఉంటుందని అంచనా.

అధికారులేమన్నారంటే..

ఈ మట్టి తవ్వకాలకు అక్రమ అనుమతుల జారీ విషయమై నర్సాపూర్‌ తహసీల్దార్‌ శ్రీనివాస్‌ను ‘సాక్షి’ప్రతినిధి ఫొన్లో సంప్రదించగా ఆయన స్పందించలేదు. ఆర్డీఓ రామకృష్ణను వివరణ కోరగా..అనుమతుల మంజూరుకు సంబంధించిన నిబంధనలను పరిశీలిస్తామన్నారు. పూర్తి వివరాలు కావాలంటే నీటిపారుదలశాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. సంగారెడ్డి అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) సంగీతను సంప్రదించగా తాను బాధ్యతలు తీసుకున్న నెల రోజుల్లో మట్టి తవ్వకాలకు అనుమతులు ఇవ్వలేదన్నారు. అంతకుముందు ఇచ్చి ఉండవచ్చని, ఫైల్‌ తెప్పించుకుని వివరాలు తెలుసుకుంటానన్నారు.

ఇటుక బట్టీలకు తరలింపు..

నిబంధనల ప్రకారం చెరువుల్లో మట్టి (సిల్ట్‌) తవ్వుకోవాలంటే రైతులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ మట్టిని పొలాల్లో వేసుకుని ఎరువులాగ వాడుకుంటారు. రైతులకు మినహా ఇటు వాణిజ్య అవసరాలకు తవ్వుకోవాలంటే తప్పనిసరిగా భూగర్భ గనుల శాఖ నుంచి క్వారీ అనుమతులు మంజూరు చేయించుకోవాలి. అక్కడి నుంచి తరలించే ప్రతీ మట్టి టిప్పర్‌కు సీనరేజీ చెల్లించి వేబిల్లులతో మట్టిని రవాణా చేయాలి. కానీ గనుల శాఖ నుంచి క్వారీ లీజు మంజూరు లేకుండానే తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. డీఎంఎఫ్‌టీకి నామమాత్రంగా డబ్బులు చెల్లించి రూ.కోట్లు విలువ చేసే సహజ సంపదను లూఠీ చేస్తున్నారు. పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ మట్టి అక్రమ దందాకు నీటిపారుదల శాఖ అధికారులతోపాటు, రెవెన్యూ, పంచాయతీ శాఖల అధికారులు ప్రత్యక్షంగానే సహకరిస్తుండటం వెనుక రూ.లక్షల్లో ముడుపులే కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో యథేచ్ఛగా మట్టి దందా

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం అల్వ చెరువును కూడా లూఠీ చేసేందుకు కూడా రంగం సిద్ధమవుతోంది. ఇక్కడ ఏకంగా 60 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తవ్వుకునే అనుమతులు కట్టబెట్టేందుకు అధికారులు పావులు కదుపుతున్నారు. స్థానికంగా ఉన్న అధికార కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు ఏకమై తెరలేపిన ఈ మట్టి దందా కోసం పాత తేదీల్లో వేలం పాట నిర్వహించినట్లు రికార్డులు సృష్టించారు. రూ.లక్షల్లో మట్టి ముడుపుల పంపకాలు బయటకుపొక్కడంతో ఈ రెండు పార్టీ ల్లోని ఒక ప్రత్యర్థివర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు మట్టి తవ్వకాలకు అనుమతులు ఇవ్వద్దని పలువురు ఇటీవల సంగారెడ్డి కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. గతంలో అనుమతి లే కుండా తవ్వకాలు జరిగితే అడ్డుకున్నారు. అయినప్పటికీ అధికార యంత్రాంగం అడ్డదారిలో అనుమతులు కట్టబెట్టాలని చూస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement