జిల్లా కేంద్రంలోని జేఎన్ రోడ్డులో అత్యధికం పట్టణ శివార్లలో రూ.700 నుంచి రూ.1,400కు పెంపు అమల్లోకి పెరిగిన స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువ
భారీగా పెరిగిన భూముల విలువ
భూముల విలువలు డబుల్ అయ్యాయి. మెదక్ పట్టణంలోని జేఎన్‌రోడ్డులో అత్యధికంగా గజం రూ. 22 వేలు పెరిగింది. పట్టణ శివారుల్లో గజం రూ. 700 నుంచి రూ.1,400 వరకు పెంచారు. అలాగే జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, ఆయా మండలాల పరిధిలో సైతం భూముల మార్కెట్ విలువను ప్రభుత్వం పెంచింది. – మెదక్‌జోన్
జిల్లా కేంద్రంలోని చమాన్ చౌరస్తా, జేఎన్‌రోడ్డులో మొన్నటి వరకు గజం భూమి రూ.17,600 ఉండగా, ఈనెల 5 నుంచి రూ.22 వేలకు పెరిగింది. ఇది మున్సిపాలిటీలో అత్యధికం. అలాగే మున్సిపాలిటీలో నూతనంగా విలీనం అయిన అవుసులపల్లి, ఔరంగాబాద్, పిల్లికొటాల్ శివారుల్లో గజం ధర మొన్నటి వరకు రూ. 700 ఉండగా, ప్రస్తుతం రూ.1,400కు చేరుకుంది. అంటే రెండింతలు పెరిగింది. అపార్ట్‌మెంట్లలో అంతస్తును బట్టి స్క్వేర్ ఫీట్‌కు మార్కెట్‌లో గజం ధర రూ.1,500 నుంచి రూ. 1,800లకు పెంచారు. మరికొన్ని చోట్ల రూ. 1,300 నుంచి రూ.1,500కు పెరిగింది. చర్చి ఏరియాలో గజం రూ. 3,100 నుంచి రూ. 5,000కు చేరుకుంది. అలాగే జిల్లాలోని పాపన్నపేట, పెద్దశంకరంపేట, కొల్చారం, టేక్మాల్, రేగోడ్, మెదక్, అల్లాదుర్గం, హవేళిఘణాపూర్ మండలాల్లో మాత్రం గజం రూ. 700 నుంచి రూ.1,300కు చేరుకుంది. మెదక్ పట్టణంలోని 1వ వార్డులో రూ.5000 నుంచి రూ. 6,200కు పెరగగా, స్లమ్ ఏరియా గొల్కొండ ప్రాంతంలో మాత్రం గజం ధర 4,100 ఉండగా, ఆ ప్రాంతంలో కొత్తగా భూముల ధరలు పెంచలేదు.
నర్సాపూర్‌లో..
నర్సాపూర్ మున్సిపాలిటీలోని మెదక్–నర్సాపూర్, తూప్రాన్–నర్సాపూర్ ప్రధాన రహదారుల పక్కన గతంలో గజం భూమి రూ. 6,100 ఉండగా, ప్రస్తుతం రూ.10,700కు పెరిగింది. పట్టణం లోపలి భాగంలో రూ. 2,500 నుంచి రూ. 4,800కు పెంచారు. నర్సాపూర్ మండలంలో ఎకరా రూ.4.50 లక్షలు ఉండగా, ప్రస్తుతం రూ.10 లక్షలకు పెరిగింది.
తూప్రాన్‌లో..
తూప్రాన్ మండలంలో ఎకరా రూ.18 లక్షలకు ఉండగా, ప్రస్తుతం అది రూ.36 లక్షలకు చేరింది. పట్టణంలో గజం రూ. 22,300కు గానూ రూ. 23,400, హెచ్‌ఎండీఏ పరిధిలో రూ. 3,100 నుంచి రూ. 5,500 పెరిగింది. కాళ్లకల్‌లో రూ.3,100 నుంచి రూ.3,900కు పెంచారు. అలాగే ఎన్‌హెచ్–44ను ఆనుకొని ఉన్న భూమి ఎకరా రూ.1.52 కోట్లు ఉండగా, ప్రస్తుతం ఆ ధర పెరగలేదు.
రామాయంపేటలో..
రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో రోడ్డును ఆనుకొని ఉన్న భూములు గజం రూ. 9,500 నుంచి రూ. 11 వేలకు పెరిగింది. జాతీయ ఎన్‌హెచ్– 44ను ఆనుకొని ఉన్న వ్యవసాయ భూమి ఎకరా రూ. 50.82 లక్షలు ఉండగా, ప్రస్తుతం రూ. 1.2 కోట్లకు పెరిగింది. మండలంలోని పలు గ్రామాల్లో గజం రూ. 2,400 నుంచి రూ. 3,600కు పెరిగింది.


