● ఇంటర్ ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు 15 మార్కులు ● ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు
మెదక్ అర్బన్: ఇంటర్మీడియెట్ బోర్డు కీలక మా ర్పులు చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఫస్టియర్‌లోనూ ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. ఫస్టియర్‌కు 15, సెకండ్ ఇయర్‌లో 15 మార్కులు కేటాయిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 62 జూనియర్ కళాశాలలు ఉండగా, ఫస్ట్ ఇయర్‌లో 6,068, సెకండ్ ఇయర్‌లో 7,055 మంది విద్యార్థులు కలిపి మొత్తం 13,123 మంది ఉన్నారు. కాగా, ఇప్పటివరకు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ, బైపీసీలోనే ప్రయోగ పరీక్షలు ఉండేవి. సెకండ్ ఇయర్‌లో సబ్జెక్ట్‌కు 30 మార్కులు ఉండేవి. ఈసారి ఫస్ట్ ఇయర్‌లో 15, సెకండ్ ఇయర్‌లో 15 మార్కులు కేటాయించారు. ఎంపీసీలో భౌతిక, రసాయన శాస్త్రాలకు 15 మార్కుల చొప్పున ఫస్ట్ ఇయర్‌లో 30 మార్కులకు ప్రయోగ పరీక్షలు ఉంటాయి. గణితంలో ఇప్పటివరకు 75 మార్కులకు రాత పరీక్ష ఉండగా.. ఈసారి నుంచి 60 మార్కులకు, మిగితా 15 మార్కులు కృత్యాధార అభ్ససనానికి కేటాయిస్తారు. ఇతర గ్రూపుల్లో కామర్స్, రాజనీతి శాస్త్రం, చరిత్ర, భూగోళ శాస్త్రం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టులకు 80 మార్కులకు రాత పరీక్ష, 20 మార్కులకు ఇంటర్నల్ పరీక్షలు ఉంటాయి. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్ తదితర లాంగ్వేజీలకు 80 మార్కులకు రాత పరీక్ష, మరో 20 మార్కులకు అంతర్గత పరీక్షలు ఉండనున్నాయి.


