తొందరొద్దు! | - | Sakshi
Sakshi News home page

తొందరొద్దు!

Jun 6 2026 9:19 AM | Updated on Jun 6 2026 9:19 AM

ఖరీఫ్‌కు ‘ఎల్‌నినో’ ముప్పు

ఖరీఫ్‌కు ఎల్‌నినో ముప్పు

తొలకరి జల్లులు కురువగానే విత్తనాలు వేయడం రైతులకు అలవాటు. అయితే ఈ వానాకాలంలో ‘ఎల్‌నినో’ ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. దీంతో జిల్లా వ్యవసాయశాఖ అప్రమత్తం అయింది. జూలై, ఆగస్టులో సాధారణ వర్షపాతం నమోదు కాకుంటే ఆరుతడి పంటలు సాగు చేయాలని అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. – మెదక్‌జోన్‌

మెతుకుసీమ అంటేనే వ్యవసాయానికి పెట్టింది పేరు. 90 శాతానికి పైగా రైతులకు జీవనాధారం. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 3.67 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నాయని అధికారులు అంచనా వేశారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను ఖరారు చేశారు. అయితే ఈసారి ‘ఎల్‌నినో’ ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. అదే జరిగితే రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. అందుకు సంబంధించిన విత్తనాలను సిద్ధంగా ఉంచేందుకు కసరత్తు చేస్తున్నారు. గతేడాది మే 26న రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని, ఈ ఏడాది ఆలస్యంగా ఈనెల రెండో వారంలో వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో కురవాల్సిన సమయంలో కాకుండా, ఒకేసారి భారీ వర్షం కురిసి పెద్ద ఎత్తున వరదలు వచ్చే అవకాశం కూడా ఉంటుందని, అలాంటి పరిస్థితి ఆగస్టు 15 వరకు జరిగితే యథావిధిగా వరిసాగు చేసుకునే పరిస్థితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

మూడు విధాలుగా విభజన

సాధారణ వర్షపాతం కన్నా తక్కువగా వర్షాలు కురిస్తే మూడు విభాగాలుగా ఆకస్మికంగా ప్రణాళికలను మారుస్తూ, ముందుకు సాగాలనే నివేదికను వ్యవసాయశాఖ అధికారులు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా జూలై 15 వరకు సాధారణం కన్నా తక్కువ వర్షం కురిస్తే పప్పు దినుసులు, మిల్లెట్స్‌, చిరుధాన్యాలు, నూనె గింజలు సాగు చేయాలని, జూలై 30 వరకు తక్కువ వర్షపాతం నమోదైతే కంది, సోయాబిన్‌, పొద్దు తిరుగుడు, కూరగాయల సాగు, ఆగస్టు 30 వరకు సాధారణం కన్నా తక్కువ వర్షం కురిస్తే కందులు, ఆముధం, కొర్రలు, మొక్కజొన్న, జొన్నలు, కూరగాయలు సాగు చేయాలని ప్రణాళికలు రూపొందించారు.

అప్రమత్తమైన వ్యవసాయ శాఖ

రైతులకు విస్తృత అవగాహన

సాగు పద్ధతులు మార్చుకోవాలని సూచన

Advertisement
 
Advertisement
Advertisement