ఒక్కో సేవకు ఒక్కో రేటు
● ఆర్టీఏ కార్యాలయంలో మామూళ్ల జాతర
● రోజుకు రూ. లక్షల్లో ఆదాయం
మెదక్ అర్బన్: మరో వారం రోజుల్లో స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. ఇంకేముంది బస్సుల ఫిట్ నెస్‌తో ఆర్టీఏ కార్యాలయంలో మామూళ్ల జాతర ఊపందుకుంది. పెద్ద కళాశాలల వద్దకు స్వయంగా అధికారులే వెళ్లి.. మామూళ్లు దండుకొని ఫిట్‌నెస్‌లు ఇచ్చి వస్తున్నారనే ప్రచారం కొనసాగుతోంది. రూ. లక్షల్లో కొనసాగుతున్న అవినీతి దందా.. అధి కారులకు కనక వర్షం కురిపిస్తుంది. బ్రోకర్ల చేతిలో బ్రేకులు అన్న చందంగా.. తమ చేతికి మట్టి అంటకుండా లంచాలు లాగేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
బదిలీల వేళ..
ఆర్టీఏ కార్యాలయంలో బదిలీపై వెళ్లే అధికారులు మామూళ్ల జోరు పెంచారు. ఇందుకు స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ కలిసి వచ్చింది. జిల్లాలో 314 స్కూల్ బస్సులు ఉన్నాయి. అందులో ఈనెల 1 వరకు వరకు 125 బస్సులు ఫిట్‌నెస్ పొందినట్లు తెలిసింది. 189కి ఫిట్‌నెస్ ఇవ్వాల్సి ఉంది. అయితే కొన్ని పేరు మోసిన విద్యా సంస్థలకు ఎక్కువ బస్సులు ఉండటంతో అధికారులు అక్కడికే వెళ్లి ఫిట్‌నెస్ ఇస్తున్నారని తెలుస్తోంది. నిజానికి ప్రతి బస్సు ఆర్టీఏ కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వేల రూపాయల మామూళ్లు దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. కార్యాలయంలో పని చేసే పోలీస్, హోంగార్డులు, ఇతర సిబ్బంది తమకు తోచిన మేర పైరవీలు చేస్తూ లంచాలు సేకరించి, వాటాలేసి పంచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలా కార్యాలయం నుంచి రోజుకు ఎంత లేదన్నా రూ.లక్ష వరకు ముడుపులు సేకరిస్తున్నారని సమాచారం.
జిల్లాలోని వాహన వినియోగదారులకు సేవలందించేందుకు మెదక్‌లో ఆర్టీఏ కార్యాలయం ఉంది. బ్రోకర్ల వ్యవస్థ రద్దు చేసినా, వారి ద్వారా వస్తేనే ఏ పనైనా జరుగుతుందని బహిరంగ రహస్యం. ముడుపులు లేనిదే.. ఒక్క లైసెన్స్ బయటకు రాదనే ఆరోపణలున్నాయి. మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్, పెద్దశంకరంపేట మండలాల్లో సుమారు 50 మంది వరకు బ్రోకర్లు ఉంటారు. వాహనాల లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్లు, ఫిట్‌నెస్‌లు, లైసెన్స్ రెన్యువల్స్ తదితర సేవలకు ఒక్కో దానికి ఒక్కో రేటు నిర్ణయించి వసూళ్లుకు తెగబడుతున్నారు. పేపర్‌పై ఒక్కో బ్రోకర్, ఒక్కో కోడ్ వేసి పంపుతుంటారు. పని అయిపోయిన తర్వాత సాయంత్రం ఒకరిద్దరు ఏజెంట్లు రోజు వారి వసూళ్లను జమ చేసి సంబంధిత అధికారులకు గుట్టు చప్పడు కాకుండా అందజేస్తున్నారు. ఈ విషయమై బదిలీపై వెళ్లిన డీటీఓ వెంకట్‌స్వామిని వివరణ కోరేందుకు ఫోన్ చేయగా.. స్పందించ లేదు.


