కౌడిపల్లి(నర్సాపూర్): ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రైతులు రోడ్డెక్కారు. శుక్రవారం మండలంలోని వెంకట్రావ్‌పేటగేట్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. గత పక్షం రోజులుగా కొనుగోలు కేంద్రం వద్దకు లారీలు రావడం లేదన్నారు. దీంతో ధాన్యం బస్తాలు పేరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీలు వచ్చే వరకు రాస్తారోకో విరమించమని బైఠాయించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ అమరేందర్‌రెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకుని రైతులకు నచ్చ జెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. జిల్లా అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రామాంజనేయులు, వెంకట్‌గౌడ్, శివ తదితరులు పాల్గొన్నారు.


