కలెక్టర్ ప్రతిమాసింగ్
చిన్నశంకరంపేట(మెదక్)/మెదక్ కలెక్టరేట్: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నార్సింగి పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ధాన్యం కాంటా చేయడంతో పాటు తరలించేందుకు ఏర్పడుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. ఇప్పటికే ముగిసిన కొనుగోలు కేంద్రాల నుంచి సిబ్బంది, హమాలీలు, వాహనాలను అవసరమైన చోటుకు సమకూర్చుకోవాలని సూచించారు. అవసరమైతే గోదాంలలో ధాన్యం నిల్వ చేసే జీపీఓలకు బాధ్యతలు అప్పగించాలన్నారు. రైస్‌మిల్లుల వద్ద రెవెన్యూ సిబ్బందిని ఉంచి అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అనంతరం నార్సింగిలో జనగణన ప్రక్రియను పరిశీలించారు. ప్రజల సమాచారం పక్కాగా నమోదు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట డీఎస్‌ఓ నిత్యానందం, డీఎంసీఎస్ భుజంగరావు, ఆర్‌డీఓ జయచంద్రారెడ్డి, తహసీల్దార్ గ్రేసిబాయి ఉన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామీణ అభివృద్ధి శాఖ 2026–27 లక్ష్యాలను సాధించాలని సూచించారు. అలాగే కాలుష్య నియంత్రణ, ప్లాస్టిక్ నివారణను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అన్నారు.


