ఉమ్మడి మెదక్ జిల్లా ఆర్‌సీఓ రాజేశం
కౌడిపల్లి(నర్సాపూర్): గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు మంచి భోజన వసతులు ఉంటాయని ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలల ఉమ్మడి మెదక్ జిల్లా ఆర్‌సీఓ రాజేశం తెలిపారు. శుక్రవారం మండలంలోని తునికి ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలో 6, 7, 8వ తరగతుల్లో బ్యాక్‌లాగ్ ఖాళీలకు సంబంధించి విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 29 ఎంజేపీ బీసీ గురుకులాల్లో 508 మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురుకులాల్లో అనుభవం ఉన్న ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యా బోధన చేస్తున్నారని వివరించారు. క్రమశిక్షణ, క్రీడలు, దుస్తులు మెరుగైన వసతులతో విద్యా బోధన ఉంటుందని చెప్పారు. విద్యార్థుల అభివృద్ధికి గురుకులాలు ఎంతో కృషి చేస్తున్నాయని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్, ప్రిన్సిపాల్ హరిబాబు, వివిధ గురుకులాల ప్రిన్సిపాల్స్, సిబ్బంది పాల్గొన్నారు.


