పెద్దశంకరంపేట(మెదక్): తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్‌గా దొంగలు చోరీకి పాల్పడిన సంఘటన మండల పరిధిలోని చీలపల్లిలో గురువారం అర్ధరాత్రి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు పలు ఇళ్లలో చొరబడి 113 తులాల బంగారం, 2.5 కిలోల వెండిని అపహరించారు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామంలో ఐదు కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఇళ్లకు వెళ్లారు. ఇదే అదనుగా దొంగలు తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. మూడు ఇళ్లలో ఎలాంటి వస్తువులు పోలేదని పోలీసులు తెలిపారు. మిగితా రెండిళ్లలోనే ఏకంగా 113 తులాల బంగారం, 2.5 కిలోల వెండిని దొంగలు ఎత్తుకెళ్లారన్నారు. గ్రామానికి చెందిన రాయిని రాములు గురువారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నూతన పాఠశాల ప్రారంభోత్సవానికి తన కుటుంబసభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి వెళ్లాడు. రాములుకు భార్య, ముగ్గురు కుమారులు, కోడళ్లు, మనుమలు ఉన్నారు. వీరికి చెందిన 110 తులాల బంగారు ఆభరణాలు, 2.5 కిలోల వెండి చోరీకి గురైంది. అలాగే ఏసీరెడ్డి మాణిక్‌రెడ్డి ఇంట్లో 3 తులాల బంగారు నగలు అపహరణకు గురయ్యాయి. శుక్రవారం ఉదయం రాములు ఇంటికి వచ్చిన పనిమనిషి గమనించి వారికి సమాచారం అందించారు. డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ రేణుకారెడ్డి, ఎస్సైలు ప్రవీణ్ రెడ్డి, శంకర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలతో ఆధారాలు సేకరించారు. ఎస్పీ శ్రీనివాసరావు చీలపల్లిలో పర్యటించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.
113 తులాల బంగారం,
2.5 కిలోల వెండి అపహరణ


