భూ పట్టా అక్రమాలపై చర్యలేవి? | - | Sakshi
Sakshi News home page

భూ పట్టా అక్రమాలపై చర్యలేవి?

May 16 2026 11:01 PM | Updated on May 16 2026 11:01 PM

అల్లాదుర్గం(మెదక్‌): అల్లాదుర్గం తహసీల్దార్‌ కార్యాలయం అక్రమాలకు నిలయంగా మారింది. జిల్లా అధికారుల అండదండలతో సిబ్బంది పలు అక్రమాలకు పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో బయటపడినా, ఉన్నతాధికారుల హస్తం ఉండటంతో తూతూమంత్రంగా విచారణ జరిపి చేతులు దులుపుకున్నారనే విమర్శలున్నాయి. బతికున్న రైతు మరణించినట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి, మరొకరికి అక్రమ పట్టా చేశారు. ఆ సర్టిఫికెట్‌ ఎవరు ఇచ్చారు. ఏ అధికారి జారీ చేశారనే విషయం ఇప్పటికీ బయటపడలేదు. అక్రమంగా పట్టా చేసుకున్న వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారులు చేసిన తప్పులకు రూ.లక్షలు ఖర్చు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిపెద్దాపూర్‌లో ఎలాంటి ఆధారాలు లేకున్నా నాలుగెకరాల భూమిని మరో వ్యక్తికి పట్టా చేశారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పులు జరుగుతాయి, సవరిస్తామని ఆర్డీఓ స్థాయి అధికారులే చెప్పడమేమిటని ప్రశ్నిస్తున్నారు. తహసీల్దార్‌ మల్లయ్య అల్లాదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ముగ్గురిపై ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. భూ భారతి చట్టాన్ని అక్రమాలకు నిలయంగా మార్చిన అధికారులపై కలెక్టర్‌ సమగ్ర విచారణకు ఆదేశించాలని రైతులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement