మెదక్ కలెక్టరేట్: ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు అన్నారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్‌లో ఉద్యానవన పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక రకాల సబ్సిడీలు ప్రకటిస్తుందన్నారు. ఆర్థిక, ఆధునిక సాంకేతిక రంగంలో నూతన పద్ధతుల ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరిచే దిశగా ముందుకు సాగుతుందన్నారు. ఆయిల్‌పామ్ సాగుతో పాటు ఆర్గానిక్ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని కోరారు. అనంతరం కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ.. రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎప్పుడూ ఒకే రకమైన పంటలు సాగు చేయకుండా పంటల మార్పిడి చేయాలన్నారు. పండ్లు, కూరగాయలు, పూల సాగుతో పాటు ఆయిల్‌పామ్ పంటలు పండించడం ద్వారా అధిక లాభాలను అర్జించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేశ్‌గౌడ్, జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్‌సింగ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
మెదక్ ఎమ్మెల్యే రోహిత్‌రావు


