మెదక్, నర్సాపూర్ డిపోల్లో 312 మంది డ్రైవర్, కండక్టర్లు మొత్తం 140 బస్సులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం: డీఎం సురేఖ
మెదక్ కలెక్టరేట్/మెదక్ జోన్/నర్సాపూర్: తమ సమస్యలను పరిష్కరించాలనే పలు డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. మంగళవారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో జేఏసీ నాయకులు జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె అనివార్యమైంది. దీంతో అర్ధరాత్రి నుంచే కార్మికులు సమ్మెలోకి దిగారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం సహా మొత్తం 32 డిమాండ్లను యాజమాన్యం ముందు పెట్టారు. జిల్లాలో మెదక్, నర్సాపూర్ రెండు ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ఈ రెండు డిపోల్లో 140 బస్సులు ఉన్నాయి. మెదక్ డిపోలో 70 మంది డ్రైవర్లు, 160 మంది కండక్టర్లు, అలాగే.. నర్సాపూర్ డిపోలో 35 మంది డ్రైవర్లు, 47 మంది కండక్టర్లు ఉన్నారు. వీరంతా సమ్మెకు సై అంటున్నారు. కాగా, ఎన్నికల సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందని, ఇచ్చిన హామీ మేరకు సంస్థను వెంటనే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే.. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, వేతనాలు ఇవ్వాలంటూ ఈ సమ్మెలో ప్రధాన డిమాండ్ వినిపిస్తోంది.
డిపోకు చేరుకున్న బస్సులు
సమ్మె అనివార్యం కావడంతో మంగళవారం రాత్రి ఆర్టీసీ బస్సులన్నీ నర్సాపూర్ డిపోకు చేరాయి. కార్మికులు సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం రాత్రి గేట్ మీటింగ్ నిర్వహించారు. సమ్మెను విజయవంతం చేయడానికి ప్రతి కార్మికుడు కంకణబద్దుడై ఉండాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కార్మికులు పలు నినాదాలు చేశారు.
ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపడుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటతి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు మెదక్ ఆర్టీసీ డిపో మేనేజర్ సురేఖ తెలిపారు. ఆర్టీసీలో సేవలు కొనసాగించేందుకు పదో తరగతి ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులను తాత్కాలికంగా కండక్టర్లుగా నియమించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తిగల అభ్యర్థులు ఒరిజినల్ మెమో, ఆధార్‌కార్డు, రెండు పాస్‌పోర్ట్‌సైజు ఫొటోలు, పూర్తి బయోడెటా తీసుకొని బుధవారం మెదక్ ఆర్టీసీ డిపో కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.డ్రైవర్ల నియామకం కోసం డీటీఓ ద్వారా హెవీ వెహికిల్ లైసెన్సు గల డ్రైవర్లను రిక్రూట్‌మెంట్ చేసుకోనున్నట్లు డీఎం తెలిపారు.


