అర్హులకు సంక్షేమ ఫలాలు
సన్నాలకు బోనస్.. ఇళ్లకు బిల్లులు
సాగుకు సాయం..
అభివృద్ధిలో భాగస్వాములవుదాం
● మహనీయుల కలలు సాకారం చేద్దాం: కలెక్టర్ రాహుల్‌రాజ్ ● పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు
ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి అధికారిపై ఉందని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో సోమవారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వాతంత్య్ర ఫలాలు అర్హులకు అందినప్పుడే వారి కల సాకారమవుతుందన్నారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి గొప్పదని అభివర్ణించారు. జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పాటు సాధించిన ప్రగతిని వివరించారు. – మెదక్‌జోన్
ప్రసంగిస్తున్న
కలెక్టర్ రాహుల్‌రాజ్
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 3.62 కోట్ల మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. దీంతో వారికి రూ.126. 57 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. అలాగే గృహజ్యోతి పథ కం ద్వారా పేదల ఇళ్లకు నెలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందుతుందన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 1,28,811 మంది వినియోగదారులకు జీరో బిల్లులు జారీ చేశామని, ఇందుకోసం రూ. 84.58 కోట్ల సబ్సిడీని లబ్ధిదారులు పొందారన్నారు. అలాగే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటివరకు 1,26,961 మంది లబ్ధిదారులకు 4,68,195 గ్యాస్ సిలిండర్లను రూ. 500లకే అందించామన్నారు. ఇందుకోసం రూ. 13.18 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం అందించిందన్నారు.
రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు ఎకరాకు రూ. 6 వేల చొప్పున 2025– 26 వానాకాలంలో 2.62 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 220.84 కోట్లు జమచేశామన్నారు. సాగులో ఉన్న అన్ని భూములకు ఏడాదికి ఎకరాకు రూ.12 వేల చొప్పున రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. అలాగే దేశంలో ఎప్పుడూ లేని విధంగా రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేశామని, జిల్లాలో అర్హులైన 87,491 మంది రైతులకు రూ. 645.41 కోట్లు మాఫీ చేశామని కలెక్టర్ వివరించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పేదలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం రూ.5 లక్షల వరకు ఉన్న ఈ పథకాన్ని రూ.10 లక్షల వరకు పెంచిందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 31,041 మంది పలు రకాల చికిత్స పొందగా, అందుకు రూ.85.18 కోట్లు ప్రభుత్వం ఆస్పత్రులకు చెల్లించిందన్నారు.
2025–26 వానాకాలం సీజన్‌లో 1,04,371 మంది రైతుల నుంచి 3,77,914 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రూ. 902.84 కోట్లను నేరుగా రైతుల అకౌంట్‌లో జమచేశామన్నారు. అలాగే 1,43,212 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యాన్ని 37,416 మంది రైతుల నుంచి సేకరించి క్వింటాల్‌కు రూ. 500 చొప్పున రూ. 61.53 కోట్ల బోనస్ డబ్బులను రైతులకు అందించినట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇప్పటివరకు జిల్లాలో 9,209 ఇళ్లు మంజూరు చేశామని, వాటిలో 6,377 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా, వివిధ స్థాయిలో నిర్మాణాలు పూర్తయిన ఇళ్లకు రూ. 101.29 కోట్లు లబ్ధిదారులకు అ కౌంట్లో జమ చేశామన్నారు. గ్రామీణాభివృద్ధి పథకంలో భాగంగా జిల్లావ్యాప్తంగా చేయూత పథకం ద్వారా ప్రతీ నెల 1,09,572 మంది లబ్ధిదారులకు నెలకు రూ. 24.52 కోట్ల వివిధ రకాల పింఛన్లను లబ్ధిదారులకు అందజేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అలాగే మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ ద్వారా 5,683 సంఘాలకు రూ. 564.40 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. అలాగే గడిచిన మూడేళ్లకు సంబంధించి 10,574 సంఘాలకు రూ. 21.68 కోట్ల వడ్డీలేని రుణాలు అందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్‌రావు, ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేశ్, అదనపు ఎస్పీ మ హేందర్, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అర్హులకు సంక్షేమ ఫలాలు


