తేలిన వన్యప్రాణుల లెక్క
రామాయంపేట(మెదక్): అటవీశాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జంతు గణన జిల్లాలో పూర్తయింది. ఈమేరకు జిల్లాలోని ఆరు అటవీ రేంజ్‌ల పరిధిలోని 98 బీట్లలో గణన కొనసాగింది. సర్వేలో 71 మంది అటవీ సిబ్బందితో పాటు 143 మంది వలంటీర్లు పాల్గొన్నారు. ఈనెల 19 నుంచి ప్రారంభమైన గణనలో మూడు రోజుల పాటు మాంసాహార, మరో మూడు రోజులు శాఖాహార జంతువుల లెక్కింపు చేపట్టారు. దీంతో అటవీ ప్రాంతంలో మనుగడ కొనసాగిస్తున్న జంతువుల లెక్క లేలింది.
మెదక్ రేంజ్ పరిధిలో అధికం
జిల్లాలోని మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్, కౌడిపల్లి, పెద్దశంకరంపేట రేంజ్‌లు ఉన్నాయి. వీటి పరిధిలోని అటవీ ప్రాంతంలో వేల సంఖ్యలో వణ్యప్రాణులున్నాయి. జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌ఓ) జోజీ పర్యవేక్షణలో వారం రోజుల పాటు గణన కొనసాగింది. గణనలో సిబ్బందితో పాటు వలంటీర్లు స్వచ్ఛందంగా పాల్గొనగా, వారికి అధికారులు శిక్షణ ఇచ్చారు. 19న జిల్లాలో టీంల వారీగా ఒకే రోజు కార్యక్రమం ప్రారంభించారు. సీసీ కెమెరాలు, జంతువుల పాదముద్రలు, వన్యప్రాణుల మలం.. తదితర ఆధారాలతో గణన నిర్వహించారు. జిల్లాలో అత్యధికంగా మెదక్ రేంజ్, అత్యల్పంగా పెద్దశంకరంపేట రేంజ్ పరిధిలో జంతు గణన చేపట్టారు. జిల్లాలోని అటవీ ప్రాంతంలో మొత్తం మాంసాహార జంతువులు 51, శాఖాహార జంతువులు వెయ్యికి పైగా ఉన్నట్లు తెలిందని అధికారులు పేర్కొన్నారు. మాంసాహార జంతువుల్లో చిరుతలు, అడవి కుక్కలు, నక్కలు, జంగ పిల్లులు ఉన్నాయి. శాకాహార జంతువుల్లో నీల్‌గాయ్, మచ్చల జింకలు, సాంబార్ జింకలు, కొండగొర్రెలున్నాయి. కాగా అటవీ ప్రాంతంలో చిరుతల సంఖ్య గతంలో కంటే పెరిగింది. పర్వతా పూర్, తిమ్మాయపల్లి అటవీ ప్రాంతంలో నాలుగు, గుండ్రెడ్డిపల్లి పరిధిలో రెండు, గాజిరెడ్డిపల్లి అటవీప్రాంతంలో మూడు, తొనిగండ్ల అటవీప్రాంతంలో రెండు చిరుతలతో పాటు మూడు చిరుత పిల్లలున్నట్లు వెల్లడైంది. అటవీప్రాంతంలో అత్యధికంగా 200లకు పైగా నీల్‌గాయ్‌లున్నాయి.
మాంసాహార జంతువుల వివరాలు
మెదక్ రేంజ్ 16
రామాయంపేట 9
తూప్రాన్ 5
నర్సాపూర్ 6
కౌడిపల్లి 12
పెద్దశంకరంపేట 3
అడవిలో ముగిసిన జంతు గణన
15 చిరుతలు ఉన్నట్లు నిర్ధారణ
గణనలో పాల్గొన్న 214 మంది సిబ్బంది
ఆన్‌లైన్‌లో నమోదు చేశాం
జిల్లాలో వారం రోజుల పాటు వన్యప్రాణుల గణన కొనసాగింది. మొత్తం 214 మంది తమ సిబ్బందితో పాటు వలంటీర్లు కార్యక్రమంలో పాల్గొని జంతువుల పాదముద్రలు, సీసీ కెమరాలు, వాటి మలం ద్వారా గణన చేపట్టి ఆన్‌లైన్‌లో నమోదు చేశాం. సాఫీగా గణన కార్యక్రమం కొనసాగింది.
– జోజి, జిల్లా అటవీ అధికారి
తేలిన వన్యప్రాణుల లెక్క


