గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం | - | Sakshi
Sakshi News home page

గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం

Jan 27 2026 9:29 AM | Updated on Jan 27 2026 9:29 AM

గెలుప

గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం

నర్సాపూర్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని బీజేపీ నర్సాపూర్‌ బల్దియా ఇన్‌చార్జి పాపయ్యగౌడ్‌ అన్నారు. సోమవారం పట్టణంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి, పార్టీ సూచించిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తాను ఎన్నికలు పూర్తయ్యే వరకు పట్టణంలోనే ఉంటానని చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్‌ మాట్లాడుతూ.. అందరం కలిసికట్టుగా పని చేస్తే మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని దక్కించుకోవచ్చని అన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా ఇన్‌చార్జి నరసింహారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీయాదవ్‌, నాయకులు పాల్గొన్నారు.

క్రీడలకూ ప్రోత్సాహం

నారాయణఖేడ్‌: విద్యతోపాటు క్రీడల్లోనూ ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని ఎంపీ సురేశ్‌ షెట్కార్‌, ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. గాంధీచౌక్‌లో ఎంపీ సురేశ్‌ షెట్కార్‌, ఇందిరాచౌక్‌, క్యాంపు కార్యాలయం, తహసీల్‌గ్రౌండ్‌లో ఎమ్మెల్యే సంజీవరెడ్డి గణతంత్ర వే డుకల్లో పాల్గొని జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో సబ్‌ కలెక్టర్‌ ఉమాహారతి, బీఆర్‌ఎస్‌ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, శివరావుషెట్కార్‌చౌక్‌లో నగేశ్‌ షెట్కార్‌, రాజీవ్‌చౌక్‌లో యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేశ్‌ షెట్కార్‌ జాతీయ జెండాలను ఎగురవేశారు. ఖేడ్‌లోని అప్పారావుషెట్కార్‌ మెమోరియల్‌ స్టేడియంలో పట్టణంలోని గురుకులాలు, విద్యార్థులకు క్రీడాపోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు తదితర అంశాలపై పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. అన్ని శాఖలకు సంబంధించి ఉత్తమ అధికారులను ఎంపిక చేసి అవార్డులను అందజేశారు.

నేటి ధర్నాకు ‘తపస్‌’ మద్దతు

మెదక్‌జోన్‌: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం మంగళవారం హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద ఎమ్మెల్సీలు ఏవీఎన్‌ రెడ్డి, మల్క కొమరయ్య, అంజిరెడ్డి చేపట్టనున్న ధర్నాకు తపస్‌ ఉపాధ్యాయ సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్లం తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు మూడేళ్లుగా పీఆర్సీ, ఐదేళ్లుగా డీఏలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అలాగే పదవీ విరమణ పొందిన వారికి మూడేళ్లుగా బెనిఫిట్స్‌ ఇవ్వలేదని వాపోయా రు. ప్రభుత్వానికి ఎన్ని సార్లు విన్నవించినప్పటికీ చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాకు జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని పిలుపునిచ్చారు.

జెండా తలకిందులు!

దుబ్బాక: పట్టణంలో సోమవారం జరిగిన రిపబ్లిక్‌ డే వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి జాతీయ జెండాను తలకిందులుగా ఆవిష్కరించారు. దీంతో వెంటనే మున్సిపల్‌ అధికారులు, అక్కడున్న వారు గమనించి జెండాను కిందికి దింపి సరిచేశారు. అనంతరం మళ్లీ ఎగురవేశారు. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. సంఘటనపై విచారించి చర్యలు తీ సుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఎమ్మెల్యే ఆదేశించారు.

కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌

జెండా ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా, ఏం చేయడం లేదని విమర్శించారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్‌ నాయకులు ఒక్కసారిగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రసంగానికి అడ్డుతగిలారు. అంతే కాకుండా ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అతికష్టం మీద ఇరువర్గాలను వారించి ఎమ్మెల్యేను పంపించారు.

గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం 
1
1/2

గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం

గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం 
2
2/2

గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement