ప్రైవేటు అప్పునకు రుణమివ్వండి | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు అప్పునకు రుణమివ్వండి

Mar 19 2025 7:59 AM | Updated on Mar 19 2025 8:00 AM

మెదక్‌జోన్‌: రాష్ట్రంలోని ప్రతీ రైతుకు పంటరుణం కాకుండా అదనంగా రూ.లక్ష రుణం ఇచ్చేలా అన్ని జిల్లాల న్యాయమూర్తులు చొరవ చూపాలని హైకోర్టు ఆదేశించటంతో రైతుల సమక్షంలో బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాలో సమావేశాలు జరగ్గా ఈ నెల 19న మెదక్‌ జిల్లాలో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. పంటరుణాలతో సంబంధం లేకుండా రైతులు ప్రైవేటు అప్పులు తీర్చుకునేందుకు ప్రతీరైతుకు అదనంగా రూ.లక్ష చొప్పున బ్యాంకులు రుణాలు ఇచ్చి ఆదుకోవాలని 2015లో మెదక్‌కు చెందిన రైతుసంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరిరావు హైకోర్టును ఆశ్రయించారు. దీనికి స్పందించిన కోర్టు 2018లో పంటరుణాలతో సంబంధం లేకుండా ప్రతీరైతుకు ప్రైవేటు అప్పు చెల్లించుకునేందుకు అదనంగా రూ.లక్ష వరకు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను ఆదేశించింది. ఈ తీర్పును గౌరవిస్తూ అప్పట్లో కొన్ని బ్యాంకులు మాత్రమే అతికొద్దిమంది రైతులకు రుణాలు ఇవ్వగా చాలా బ్యాంకులు మాత్రం రిజర్వు బ్యాంకు ఆదేశాలు లేవనే సాకుతో రుణాలివ్వలేదు. దీంతో గతేడాది శ్రీహరిరావు మళ్లీ కోర్టును ఆశ్రయించగా గత ఫిబ్రవరి 25న హైకోర్టు తాజాగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల న్యాయమూర్తులకు ఆదేశాలు జారీచేసింది. దీంతో న్యాయమూర్తుల సమక్షంలో రైతులు– బ్యాంకర్లతో సమావేశాలు ఏర్పాటు జరుగుతున్నాయి.

ఇప్పటికే పూర్తయిన సమావేశాలు

ఇప్పటికే రాష్ట్రంలోని సిద్దిపేట, సంగారెడ్డి, కరీంనగర్‌లలో ఆయా జిల్లాల న్యాయమూర్తుల సమక్షంలో సమావేశాలు నిర్వహించారు. కాగా, మెదక్‌ జిల్లాలోని హవేళిఘణపూర్‌ మండల పరిధిలోని రైతు వేదికలో ఈనెల 19న మెదక్‌ డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సెల్‌ అథారిటీ సెక్రటరీ సీనియర్‌ జడ్జి జితేందర్‌ సమక్షంలో రైతులు, లీడ్‌బ్యాంకు మేనేజర్‌, వ్యవసాయశాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి రైతులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు.

2012లో ఇలా...

అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతల కుటుంబాలకు ప్రభుత్వాలు ఇచ్చే పరిహారంలో నిర్లక్ష్య ధోరణిని సవాల్‌ చేస్తూ శ్రీహరిరావు బాధిత రైతు కుటుంబాల తరఫున కోర్టును ఆశ్రయించాడు. మెదక్‌ ఉమ్మడి జిల్లాలో 300మంది రైతులకు ఒక్కోకుటుంబానికి రూ.1.50 లక్షల పరిహారం చొప్పున ప్రభుత్వం అందించాలని 2012లో కోర్టు ఆదేశించింది.

రైతుసంరక్షణ సమితి అధ్యక్షుడి పిల్‌తో హైకోర్టు ఆదేశం

జిల్లా న్యాయమూర్తులు చొరవ తీసుకోవాలి

ఇప్పటికే పలుజిల్లాల్లో సమావేశాలు

నేడు మెదక్‌ జిల్లా హవేళిఘణపూర్‌లో..

ఇది రైతు విజయం

ప్రైవేట్‌ అప్పుల్లో కూరుకుపోయిన రైతులకు ఇది మంచి సదావకాశం. ప్రతీ రైతుకు పంటరుణంతో సంబంధంలేకుండా అదనంగా రూ.లక్ష వరకు బ్యాంకులు అప్పులిస్తున్నాయి. వాటిని తీసుకుని ప్రైవేట్‌ అప్పులను తీర్చుకోవాలి. ఏళ్లతరబడి కోర్టులో కేసు కొనసాగించగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో యంత్రాంగం రైతుల వద్దకే కదిలింది ఇది రైతు విజయంగా భావిస్తున్నాను.

–శ్రీహరిరావు,

రైతు సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement