ఇక విద్యార్థులకు స్కూల్ కిట్లు
మెదక్ అర్బన్: కార్పొరేట్‌కు దీటుగా సర్కార్ బడులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు స్కూల్ కిట్లు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫాం అందజేస్తున్న విద్యాశాఖ, మరో అడుగు ముందుకు వేసి 22 వస్తువులతో కూడిన కిట్లను పాఠశాల ఆరంభం రోజే అందించేందుకు సంసిద్ధమవుతోంది. కాగా పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలకు వేర్వేరు కిట్లు అందజేయనున్నారు.
జిల్లాలో 956 ప్రభుత్వ పాఠశాలలు
జిల్లాలో 956 ప్రభుత్వ పాఠశాలల్లో 83,064 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో నిరుపేద విద్యార్థులకు పెద్ద చదువులు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం సర్కార్ బడులకు భారీగా నిధులు కేటాయిస్తుంది. ప్రభుత్వ పరిధిలో లోకల్ బాడీ స్కూళ్లు 902 ఉండగా, 63,266 విద్యార్థులు ఉన్నారు. కేజీబీవీ, గురుకులాలు, మినీ గురుకులాలు, మోడల్ స్కూళ్లు కలిసి 54 ఉండగా, 19,798 విద్యార్థులు ఉన్నారు. ఇందులో నాన్ రెసిడెన్షియల్, రెసిడెన్షియల్ విద్యార్థులకు వేర్వేరు కిట్లు ఇవ్వనున్నారు. ఒక్కో కిట్‌లో మొత్తం 22 వస్తువులు ఉంటాయి. కాగా విద్యార్థులకు ఇప్పటికే ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, రెండు జతల యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు.
22 రకాల వస్తువులు
ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఇచ్చే కిట్‌లలో పాఠ్య పుస్తకాలు, నోట్, వర్క్‌బుక్‌లు, ఏకరూప దుస్తులు, స్కూల్ బ్యాగులు, బూట్లు, సాక్స్, బెల్ట్, టై, ఐడీ కార్డులు, పెన్సిళ్లు తదితర వస్తువులు ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాలు, కేజీబీవీ వి ద్యార్థులకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు, బూట్లు, దుప్పటి, స్పోర్ట్స్, పీటీ డ్రెస్, బ్లేజర్ తదితర వస్తువులు అందజేయనున్నారు.
బడులు తెరిచేరోజున పంపిణీ
జిల్లాలో 83,064 మందికి లబ్ధి
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు


