4 బల్దియాలు నారీమణులకే
● మున్సిపల్ చైర్‌పర్సన్ రిజర్వేషన్లు ఖరారు
● మెదక్ బీసీ మహిళకు, మిగితా మూడు జనరల్‌కు కేటాయింపు
మెదక్‌జోన్: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు శనివారం ఖరారయ్యాయి. రాష్ట్ర యూనిట్‌లో భాగంగా ప్రభుత్వం నాలుగింటిని మహిళలకే రిజర్వుడ్ చేసింది. మెదక్ (బీసీ) మహిళకు కేటాయించగా, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్ మున్సి పాలిటీలను జనరల్ మహిళకు రిజర్వుడ్ చేశారు. ఇప్పటికే ఆయా సామాజికవర్గాల వారీగా వార్డుస్థానాల రిజర్వేషన్లు పూర్తి కాగా, నాలుగు మున్సిపాలిటీలకు సంబంధించి 75 వార్డులు ఉండగా వాటిని కలెక్టరేట్‌లో ఆయా రాజకీయ పార్టీల నేతల సమక్షంలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. కాగా మొత్తంగా 50 శాతం వార్డులను మహిళాలకు కేటాయించగా, 2011 జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు ఖరారు చేశారు. బీసీలకు డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల మేరకు రిజర్వేషన్లు కల్పించారు. మెదక్ మున్సిపాలిటీ 1952లో ఏర్పాటు అయింది. 74 ఏళ్లలో రెండుసార్లు చైర్‌పర్సన్‌గా మహిళలకు అవకాశం దక్కింది. తాజాగా శనివారం మరోసారి మహిళకు కేటాయించారు. 1957లో కేవల్ మున్నాబాయి చైర్మన్‌గా పనిచేయగా, 2000 సంవత్సరంలో కొండన్ సావిత్రి చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం 26 ఏళ్ల తర్వాత మరోసారి చైర్‌పర్సన్‌గా బీసీ మహిళాకు అవకాశం దక్కింది. కాగా నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్ మున్సిపాలిటీలు 2018లో ఏర్పడ్డాయి. వాటికి 2020 జనవరిలో ఎన్నికలు జరగగా నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీలు (బీసీ) జనరల్ రిజర్వుడ్ అయింది. రామాయంపేట ఓసీకి రిజర్వుడ్ అయింది. ప్రస్తుతం ఈ మూడు మున్సిపాలిటీలు జనరల్ మహిళకు రిజర్వుడ్ కావటం విశేషం.
కొందరికి ఖేదం.. మరికొందరికి మోదం
మెదక్ అర్బన్: మెదక్ మున్సిపాలిటీ ఎన్నికల రిజర్వేషన్లు ఆశావహులకు ఆశ, నిరాశలు మిగిల్చాయి. చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకొని రాజకీయ పావులు కదిపిన కాంగ్రెస్‌లోని ఓ ముఖ్య నాయకుడికి రిజర్వేషన్ ఆశనిపాతమైంది. చైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో ఓసీ వర్గానికి చెందిన ఆయన నిరుత్సాహానికి గురయ్యారు. కాగా ఇదే పార్టీ నుంచి చైర్మన్ పదవి ఆశిస్తున్న మరో ముఖ్య నాయకుడికి రిజర్వేషన్ కలిసొచ్చింది. ఆయన సొంత వార్డు సైతం అనుకూలంగా వచ్చింది. గతంలో ఆయన సతీమణి సైతం మున్సిపల్ చైర్మన్‌గా పని చేయడం.. ఆయన ఆశలకు ఊపిరి పోస్తున్నాయి. ఇక బీఆర్‌ఎస్‌లో చైర్మన్ పదవిని ఆశిస్తున్న ఓ యువ నాయకుడు చైర్మన్‌గా, వైస్ చైర్మన్‌గా, ఆయన భార్య కౌన్సిలర్‌గా పని చేశారు. ప్రస్తుతం ఆయన, ఆయన భార్యకు గతంలో పోటీ చేసిన వార్డులు అనుకూలంగా రిజర్వ్ కావడంతో ఆ శలు పెరిగాయి. బీఆర్‌ఎస్ నుంచి చైర్మన్ పదవి ఆశిస్తున్న ఓ మాజీ చైర్మన్‌కు గతంలో పోటీ చేసిన వార్డు రిజర్వేషన్ అనుకూలంగా రాలేదు. పార్టీ ఆశీస్సులు లభిస్తే ఆయన భార్యను మరో వార్డు నుంచి పోటీ చేయించే అవకాశం ఉందని తెలు స్తోంది. బీఆర్‌ఎస్‌కు చెందిన మరో ఓసీ నాయకుడు గతంలో కౌన్సిలర్‌గా పని చేశారు. ఈసారి ఆయన పోటీ చేసిన వార్డు బీసీ జనరల్‌కు రిజర్వ్ కావడంతో అవకాశం లేకుండా పోయింది. ఇక కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఓ మాజీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఓ కౌన్సిలర్ సొంత వార్డుల్లో అనుకూలమైన రిజర్వేషన్లు వచ్చా యి. కాగా చైర్మన్ గతంలో ఇతర వార్డు నుంచి పోటీ చేసి గెలిచాడు. కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఓ మహిళా కౌన్సిలర్ గతంలో రెండు పర్యాయాలు గెలిచారు. రిజర్వేషన్ సైతం అనుకూలంగా రావడంతో చైర్‌పర్సన్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా మొత్తం మీద రిజర్వేషన్లు అనుకూలంగా లేకపోవడంతో కొంత మ ంది ఔత్సాహికులు ఆశలు చావక, అనుకూల వా ర్డుల్లోకి వలస వెళ్లేందుకు దారులు వెతుక్కుంటున్నారు. అయితే చైర్మన్ పదవికి మాత్రం రెండు పార్టీల్లో రిజర్వేషన్లు అనుకూలించక, బహుముఖ పోటీ తప్పిందని భావిస్తున్నారు. ఒక విధంగా పార్టీ అధినాయకులకు తలనొప్పి తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


