● పట్టు వీడని సంకల్పమే అసలైన పరీక్ష ● రోజుకు 12 గంటలు చదివా.. ● గ్రూప్–3 స్టేట్ టాపర్ అర్జున్‌రెడ్డి
పాపన్నపేట(మెదక్): పోటీ పరీక్షల సన్నద్ధత ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో అవాంతరాలు ఏర్పడుతుంటాయి.. కాని పట్టు వీడని సంకల్పంతో ముందు కెళ్లడమే అసలైన పరీక్ష అని గ్రూప్– 3 స్టేట్ టాపర్ కుకునూరి అర్జున్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన ‘సాక్షి’తో పలు విషయాలు పంచుకున్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసి 2013 నుంచి పోటీ పరీక్షలకు సన్నద్ధత ప్రారంభించానని చెప్పారు. మొదటి ప్రయత్నంలోనే 2014లో వీఆర్‌ఓ పోస్టు సాధించానని.. ఆ పోస్టు తన లక్ష్యం కాకపోయినప్పటికీ ఉద్యోగంలో చేరానని తెలిపారు. అప్పటి నుంచి పోటీ పరీక్షలపై ఆశతో ఒక వైపు ఉద్యోగం, మరో వైపు ప్రిపరేషన్ కొనసాగించానని చెప్పారు. ఏళ్ల తరబడి ఎదురు చూపులు తన లక్ష్యాన్ని నీరు గార్చలేదన్నారు. సన్నద్ధతలో భాగంగా ఎంపిక చేసిన మెటీరియల్ చదువుకొని, సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలని సూచించారు. నోట్స్‌ను వర్తమాన అంశాలతో సమన్వయం చేసుకుంటూ ప్రిపేర్ కావాలన్నారు. తాను రోజుకు 12 గంటలు చదివినట్లు చెప్పారు.
కుటుంబమే ప్రేరణ
నా కుటుంబమే నాకు ప్రేరణ అని అర్జున్‌రెడ్డి అన్నారు. నాన్న నరేందర్‌రెడ్డి లైబ్రెరియన్, అమ్మ శోభ గృహిణి, తమ్ముడు అరుణ్‌రెడ్డి ఆర్‌అండ్‌బీ ఏఈ, పెద్ద చెల్లెలు అక్షిత సాఫ్ట్‌వేర్ ఇంజ నీర్, చిన్న చెల్లెలు హర్షిత మెడిసిన్, బాబాయి శ్రీనివాస్‌రెడ్డి హెడ్ కానిస్టేబుల్.. వీరంతా నా లక్ష్య సాధనకు ఊపిరిలూదారని తెలిపారు. గ్రూప్– 1 సాధించాలన్నదే నా లక్ష్యమని, ఉన్నతాధికారిగా ప్రజలకు బాధ్యతాయుతమైన సేవలు అందించాలన్నదే జీవిత ఆశయమన్నారు. పోటీ పరీక్షల ప్రిపరేషన్‌లో ప్రభుత్వ గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడుతాయని వివరించారు. ప్రస్తుతం గ్రూప్–3 టాపర్‌గా నిలిచినా, గ్రూప్– 2లో 18వ ర్యాంకు వచ్చింది కాబట్టి అదే ఉద్యోగంలో జాయిన్ అవుతానని వెల్లడించారు.