మంచిర్యాలటౌన్: జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం)లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వివిధ కేటగిరీ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె సోమవారం ఏడో రోజుకు చేరింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాయకులతో కలిసి సమ్మెకు మద్దతు తెలిపారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులకు తమ పార్టీ పూర్తి అండగా ఉంటుందని, కేంద్ర ప్రభుత్వ నిధుల విషయంలో పూర్తిగా వాటాను సమయానికి ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించడంలో జాప్యం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.


